అందరి ఆశలు కేటీయార్ పైనేనా ?

తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ లోని అసంతృప్తుల ఆశలన్నీ మంత్రి కేటీఆర్ పైనే పెట్టుకున్నారు. విదేశాల్లో ఉన్న కేటీయార్ రాష్ట్రంలో జరిగే ప్రతి డెవలప్మెంటును ఎప్పటికప్పుడు తెలుసుకుంటునే ఉన్నారు. అవసరమైనట్లుగా ఎవరితో ఏమి మాట్లాడాలో అలా మాట్లాడుతునే ఉన్నారు. 119 నియోజకవర్గాల్లో 115 స్ధానాల్లో కేసీయార్ అభ్యర్ధులను ప్రకటించేసిన విషయం తెలిసిందే. దాంతో పార్టీలోని అసంతృప్తుల్లో తీవ్రమైన అలజడి మొదలైంది. దాంతో పార్టీలో గందరగోళం పెరిగిపోతోంది.

కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల విషయంలో కనీసం 35 నియోజకవర్గాల్లో తీవ్ర విభేదాలు కనబడుతున్నాయి. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న నేతలు తాము కలవాలని అనుకున్నా కేసీయార్ అవకాశం ఇవ్వటం లేదు. తాను ఎవరినైతే కలవాలని కేసీయార్ అనుకుంటున్నారో వాళ్ళని మినహా మిగిలిన నేతలను కలవటం లేదు. దాంతో అసంతృప్త నేతలందరి చూపు, ఆశలు కేటీయార్ మీదనే ఉన్నాయి. రాష్ట్రంలోనే మరో మంత్రి హరీష్ రావు అందుబాటులోనే ఉన్నా పెద్దగా ఉపయోగం లేదంటున్నారు.

కేసీయార్ కు హరీష్ మేనల్లుడు మాత్రమే. అదే కేటీయార్ అయితే కొడుకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. పార్టీకి భావి అధినేత, సీఎం అనే ప్రచారం అందరికీ తెలిసిందే. అందుకనే అందరి ఆశలు కేటీయార్ పైనే ఉంది. అయితే కేటీయార్ వచ్చిన తర్వాత మత్రం ఏమి చేయగలరు ? అన్నది పెద్ద ప్రశ్నగా తయారైంది. ఎందుకంటే ఇపుడు సిట్టింగ్ ఎంఎల్ఏల్లో ఏడుగురికి కేసీయార్ టికెట్లివ్వలేదు. అంటే ఈ ఏడు నియోజకవర్గాల్లో కొత్తవారిని అభ్యర్ధులుగా ప్రకటించేశారు.

అభ్యర్థులను ప్రకటించక ముందు కేటీయార్ జోక్యం చేసుకునే అవకాశముంది కానీ ప్రకటించేసిన తర్వాత చేసేదేమీ లేదు. ఒకవేళ ఇపుడు అభ్యర్థులను మార్చితే అది పార్టీ ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. ఎందుకంటే అప్పుడు టికెట్లు రానివాళ్ళు, టికెట్లు వచ్చి పోయిన వాళ్ళు అంతా కలిసి కేసీయార్ మీద కచ్చితంగా తిరుగుబాటు చేయటం ఖాయం. అదే జరిగితే ఎన్నికలకు ముదే పార్టీ ముణిగిపోవటం ఖాయం. మరి ఎన్నో డక్కా మొక్కీలు తిన్న కేసీయార్ కూడా ఇంత తెలివితక్కువగా అభ్యర్థులను ఎంపిక చేస్తారా అని అందరు ఆశ్చర్యపోతున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.