నరేంద్రమోడీలో ఓటమిభయం పెరిగిపోతున్నట్లుంది. అందుకనే వరసబెట్టి నిత్యావసరాల ధరలు తగ్గిస్తున్నారు. ఇంతకాలం జనాల నడ్డివిరుస్తు అన్నింటి ధరలను ఆకాశానికి పెంచేసిన మోడీ ప్రభుత్వంకు ఇపుడు హఠాత్తుగా జనాల ఇబ్బందులు గుర్తుకొస్తున్నాయి. రాఖీపౌర్ణమి సందర్భంగా వంటగ్యాస్ సిలిండర్ ధర 200 రూపాయలు తగ్గించటమే ఇందుకు నిదర్శనం. అలాగే పేదలు వాడే ఉజ్వల్ పథకంలోని గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 400 రూపాయలు తగ్గింది.
వంటగ్యాస్ ధరలు తగ్గించటం వల్ల సుమారు 36 కోట్లమంది వినియోగదారులకు ఉపశమనం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే తొందరలోనే పెట్రోల్, డీజల్ ధరలు తగ్గుతాయని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించటం వల్ల మరో 100 కోట్లమందికి లాభం జరుగుతుందని అనుకోవటంలో తప్పులేదు. ఎలాగంటే పెట్రోల్, డీజల్ ధరలు తగ్గింపు వల్ల అనేక నిత్యావసరాల ధరలు తగ్గుతాయని అందరికీ తెలిసిందే.
ప్రతి నిత్యావసర వస్తువు ధరలోను పెట్రోల్, డీజల్ ధరలు కలిసే ఉంటాయని తెలిసిందే. ముఖ్యంగా రవాణా ఛార్జీల మోత ఎక్కువగా ఉంటుంది. అలాగే పెట్రోల్, డీజల్ ధరల్లో ఎక్సైజ్ పన్నులు కలిసే ఉంటాయి. ఇలా అడుగుడుగునా అన్నీ ధరలు కలిసి చివరకు నిత్యావసరాల ధరలను ఆకాశానికి తీసుకెళతాయి. అదే పెట్రోల్, డీజల్ ధరలు తగ్గిస్తే ఆటోమేటిగ్గా అన్నింటిపైన వసూలు చేస్తున్న పన్నులు తగ్గి వాటి అసలు ధరలు తగ్గుతాయి. ఇపుడు సడెన్ గా మోడీకి జనాల బాధలు ఎందుకు గుర్తుకొచ్చాయి.
ఎందుకంటే తొందరలో జరగబోయే ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే కారణమని చెప్పాలి. ఈ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు కష్టమంటున్నారు. నిజంగానే బీజేపీ ఓడిపోతే దాని ప్రభావం ఆ తర్వాత జరగబోయే పార్లమెంటు ఎన్నికలపైనా పడుతుంది. కాంగ్రెస్ పార్టీ పుంజుకుని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేకొద్దీ బీజేపీకి ముందుగా సమస్య ఎదురయ్యేది రాజ్యసభలోనే. తర్వాత లోక్ సభలో కూడా దాని ప్రభావం పడుతుంది. అందుకనే ఓటమిభయంతోనే గ్యాస్ ధరలు తగ్గించి పెట్రోల్, డీజల్ ధరలు తగ్గింపనే సంకేతాలను పంపుతున్నారు నరేంద్రమోడీ.