తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించి అధికారం దక్కించుకునే దిశగా కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ కూడా వేగాన్ని పెంచుతోంది. టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. 119 నియోజకవర్గాలకు గాను వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. అయితే ఇందులో ఒకే నియోజకవర్గం నుంచి నేతలతో పాటు వాళ్ల వారసులు కూడా బరిలో దిగేందుకు సిద్ధమవడం గమనార్హం. ఒకరికి కాకపోతే మరొకరికైనా టికెట్ వస్తుందనే ఆశతో ఇలా నేతలు, వారసులు దరఖాస్తు చేసుకున్నట్లు టాక్.
ముషీరాబాద్ టికెట్ కోసం పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, ఆయన తనయుడు అనిల్ కుమార్ ఇద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. ఆందోలు నియోజకవర్గంలో పోటీకి సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర్ రాజనరసింహతో పాటు ఆయన కుమార్తె త్రిష సిద్ధమయ్యారు. మరోవైపు సీనియర్ నాయకుడు జానారెడ్డి కొడుకుల్లో పెద్దాయన రఘువీర్రెడ్డి మిర్యాలగూడ, చిన్నాయన జైవీర్రెడ్డి నాగార్జున సాగర్ కోసం దరఖాస్తులు సమర్పించారు.
ఎమ్మెల్యే సీతక్క తనయుడు సూర్యం పినపాక నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇలా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం ఒకటే కుటుంబం నుంచి ఇద్దరు దరఖాస్తు చేసుకోవడం ఆసక్తి రేపుతోంది. ఇద్దరిలో ఒకరికి టికెట్ నిరాకరించినా.. మరొకరికైనా అధిష్ఠానం టికెట్ ఇస్తుందనే ఆశతో వీళ్లున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates