రెడ్డి సామాజికవర్గం అంటే కేసీయార్ కు భయమా ? ఇపుడిదే అంశంపై పార్టీలో చర్చ జోరుగా జరుగుతోంది. ఎందుకంటే గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రాజ్ భవన్లో పట్నం మహేందర్ రెడ్డితో ప్రమాణస్వీకారం చేయించి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. చాలా కాలం క్రితమే పట్నంను కేసీయార్ క్యాబినెట్లో నుండి డ్రాప్ చేశారు. అప్పుడు ఎందుకు డ్రాప్ చేశారు ? ఇపుడు సడెన్ గా ఎందుకు తీసుకుంటున్నారు ? అన్నది ఎవరికీ తెలీదు. అయితే అభ్యర్ధుల ప్రకటన తర్వాత మాత్రం ఒక విషయం అందరికీ అర్ధమైంది.
అదేమిటంటే మొత్తం 119 నియోజకవర్గాల్లో 40 టికెట్లను రెడ్లకే కేటాయించారు. రెడ్లకు అత్యధిక టికెట్లను కేటాయించటమే కాకుండా ఇపుడు పట్నంను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. ఎందుకిదంతా చేస్తున్నారంటే రెడ్డి సామాజికవర్గం అంటే కేసీయార్లో చాలా భయముందని అర్ధమవుతోంది. చాలా నియోజకవర్గాల్లో రెడ్డి సామాజికవర్గమే గెలుపోటముల్లో కీలకపాత్ర పోషిస్తుంది. పైగా రెడ్డి సామాజికవర్గంలోని నేతలు ఇపుడు కాంగ్రెస్ వైపు వెళుతున్నారు.
రాబోయే ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గంలోని కీలకమైన నేతలు కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతున్నారు. కాబట్టి వీళ్ళు మిగిలిన రెడ్డి నేతలను కూడా ఎక్కడ ఆకర్షించి పార్టీలోకి లాక్కుంటారో అనే భయం కేసీయార్ లో పెరిగిపోతోందట. అదే జరిగితే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి దెబ్బపడటం ఖాయమని అర్ధమైనట్లుంది. అందుకనే టికెట్లలో ఎక్కువగా కేటాయించటమే కాకుండా అదనంగా పట్నంను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు.
ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే తాను రెడ్డి సామాజికవర్గానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నానో చెప్పుకోవటానికే. ఇదే సమయంలో కీలకమైన రెడ్లెవరు కాంగ్రెస్ వైపు వెళ్ళకుండా ఆపటానికే అని అర్ధమవుతోంది. రెడ్లను మంచి చేసుకోవటం కోసం కేసీయార్ బీసీలను తక్కువ చేయటానికి కూడా సిద్ధపడ్డారని పార్టీలోని టాక్ వినబడుతోంది. 22 మంది బీసీలకు మాత్రమే టికెట్ ఇవ్వటాన్ని పార్టీలో చర్చించుకుంటున్నారు. పైగా మంత్రివర్గంలో బీసీ నేత ఈటల రాజేందర్ స్ధానాన్ని ఇపుడు రెడ్డి సామాజికవర్గం నేతతో భర్తీ చేయటాన్ని కూడా గులాబీ పార్టీ నేతలు విచిత్రంగా చెప్పుకుంటున్నారు. ఏడాదిన్నరపాటు స్ధానాన్ని భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచేసి ఇపుడు సడెన్ గా పట్నంతో చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates