ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా నవరత్నాలు- జగనన్న ఇళ్ల పథకంలో భాగంగా 30 లక్షల మంది పేదలకు ప్రభు త్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈవిషయంపై చాలా చోట్ల అవినీతి ఆరోపణలు వచ్చాయి. అనేక మంది ఈ పథకం ప్రకటించడానికి ముందే.. రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు కొని.. ఈ పథకం ప్రకటించాక.. ఆయా భూములనే ప్రభుత్వానికి నాలుగింతల ధరను పెంచి విక్రయించారనే వాదన ఉంది.
సరే.. తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను కూడా జగనన్న ఇళ్ల పథకంలో భాగంగా సంపాయించుకుంటే ఎవరు మాత్రం గుర్తిస్తారని ప్రశ్నించారు. అంతేకాదు.. కనీసం 50 కోట్లయినా.. వెనుకేసుకోవాలని అనుకున్నట్టు చెప్పారు. కానీ, అలా చేయలేదని.. సీఎం జగన్ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు.. తాను మాత్రం ఎందుకు చేయకూడదని అనుకున్నానని బాలినేని వ్యాఖ్యానించారు.
తన నియోజకవర్గం ఒంగోలు పరిధిలో వచ్చే నెలలో 25 వేల మంది లబ్ధి దారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వను న్నట్టు బాలినేని చెప్పారు. ఒంగోలులో పేదలకు ఇళ్ల పంపిణీలో తాను అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని బాలినేని సవాల్ విసిరారు. పేదలకు ఇళ్లు ఇవ్వడం కూడా ప్రతిపక్షానికి ఇష్టం లేకుండా పోయిందన్నారు. అందుకే కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు.
‘‘పేదలకు పంచే ఇళ్ల పట్టాల పంపిణీలో నేను సంపాదించాలనుకుంటే రూ.500 కోట్లలో రూ.50 కోట్లు సంపాదించుకునేవాడిని. కానీ, నేను ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదు’’ అని బాలినేని వ్యాఖ్యానించారు. వచ్చే 2024 ఎన్నికల్లో ఒంగోలు నుంచే తాను పోటీ చేస్తానని.. ఈ విషయంలో ఎలాంటి అపనమ్మకం అవసరం లేదని చెప్పారు. కొంత మంది రకరకాలుగా మాట్లాడుతున్నారని, పత్రికల వారు కూడా రాస్తున్నారని.. అవన్నీ అభూత కల్పనలేనని బాలినేని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates