వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు విన్న తర్వాత అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గాజువాకలో పవన్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎగిరేది జనసేన జెండానే అని అన్నారు. ప్రజాధరణ చూస్తుంటే పోయిన ఎన్నికల్లో తాను ఓడిపోయినట్లుగా భావించటం లేదన్నారు. గాజువాక తన నియోజకవర్గం అని ప్రకటించారు. సరే తర్వాత చాలా విషయాలే మాట్లాడారు. గాజువాక సభలో పవన్ మాట్లాడిన మాటలు చూసిన తర్వాత రాబోయే ఎన్నికల్లో పవన్ మళ్ళీ ఇక్కడినుండే పోటీచేయాలని అనుకుంటున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఎందుకంటే పోయిన ఎన్నికల్లో పవన్ అక్కడి నుంచి పోటీచేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి చేతిలో పవన్ సుమారు 16 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓడిపోయినా తాను గాజువాకలోనే ఆఫీసు పెట్టుకుంటానని చెప్పారు కానీ ఆ తర్వాత మొహం కూడా చూడలేదు. స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన మీటింగులప్పుడు గాజువాకకు రావటమే కానీ ప్రత్యేకించి పర్యటించింది లేదు. అసలు పోయిన ఎన్నికల్లో గాజువాకలో పవన్ ఎందుకు పోటీ చేశారు ?
ఎందుకంటే జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో అత్యధికంగా సభ్యత్వం నమోదైంది గాజువాకలోనే. సుమారు 95 వేల సభ్యత్వాలు నమోదయ్యాయి. దాంతో ఇక్కడ పోటీచేస్తే గెలుపు గ్యాంరెటీ అని అర్ధమైన కారణంగానే పవన్ ఏరికోరి భీమవరంతో పాటు ఇక్కడ కూడా పోటీచేసింది. అయితే పవన్ మరచిపోయిన విషయం ఒకటుంది. అదేమిటంటే సభ్యత్వ నమోదు వేరు, ఓట్లేయటం వేరని.
రకరకాల కారణాలతో సభ్యత్వాలు 95 వేలకు చేరుకునుండచ్చు. కానీ వాళ్ళంతా ఓట్లేస్తారని గ్యారెంటీ లేదు. అందుకనే 16 వేల తేడాతో ఓడిపోయారు. సరే చరిత్రను పక్కన పెట్టేస్తే ఇపుడు గాజువాక పర్యటన సందర్భంగా పవన్ ఆలోచన చూస్తే మళ్ళీ ఇపుడు ఇక్కడినుండే పోటీచేయాలని ఆలోచిస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలని ఓ పది దాకా ప్రచారంలో ఉన్నాయి. వీటిల్లో భీమవరం కూడా ఉంది. దానికి ఇపుడు గాజువాక అదనంగా తోడైనట్లుంది. మరి పోటీచేయబోయే నియోజకవర్గాన్ని పవన్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates