తెలంగాణలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన కేసీఆర్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం కసరత్తులు చేస్తున్నారు. పార్టీని ఎలాగైనా గెలిపించాలని ప్రణాళికల్లో తలమునకలై ఉన్నారు. అభ్యర్థుల జాబితాపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నెల 17 తర్వాత 80 నుంచి 90 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కేసీఆర్ ప్రకటించే అవకాశముంది.
అందరి కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించేసి ప్రత్యర్థి పార్టీలను దెబ్బకొట్టాలని చూస్తున్న కేసీఆర్.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. తన ఫామ్‌హౌజ్‌లో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావుతో కలిసి అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. మొదట ఎలాంటి సమస్యలు లేని నియోజకవర్గాల జాబితాను ప్రకటించాలని కేసీఆర్ చూస్తున్నారు. వచ్చే వారంలోనే ఆయన జాబితా వెల్లడించే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అంతా బాగానే ఉంది.. కానీ సమస్యలు లేని నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయన్నది కేసీఆర్‌కే తెలియాలనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని మెజారిటీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నాయకులే అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. అంతే కాకుండా కొంత మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రకటించే అభ్యర్థుల జాబితాపై ఆసక్తి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్ తదితర చోట్ల వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు కేసీఆర్ మరో అవకాశం ఇస్తారా అన్నది ఇక్కడ కీలకాంశం. ఈ ఎమ్మెల్యేలు టికెట్ వస్తుందో లేదోననే టెన్షన్లో ఉన్నట్లు తెలిసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates