భారతీయ జనతా పార్టీ ఏపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కొంతకాలంగా మౌనంగా ఉన్నారు. ఈ ఏడాది జూన్ మొదటి వారంలో ఆయనను అధ్యక్షుడి పదవి నుంచి తప్పించారు. ఆ స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరిని నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులిచ్చింది. ఈ నియామకం వెనుక పలు సమీకరణలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పురంధేశ్వరికి పూర్తిగా సహకరిస్తా.. పార్టీ కార్యకర్తగా తాను పనిచేస్తానని ఆ సమయంలో వీర్రాజు ప్రకటించారు. ఆ తర్వాత ఆయన ఎందుకో మౌనం వహించారు.
సోము వీర్రాజు నాయకత్వంపై అప్పట్లో బీజేపీలోని ఓ వర్గం గుర్రుగా ఉండేది. పార్టీ నేతలతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని కొందరు ఆయనపై ఫిర్యాదు కూడా చేశారు. ముఖ్యంగా కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడడానికి వీర్రాజే కారణమని కొందరు గట్టిగా నమ్మారు. పైగా పదవిలో ఉన్నపుడు వైసీపీ, బీజేపీ ఒకటే అంటూ టీడీపీ పలు ఆరోపణలు చేసింది. కాగా.. 2024 తర్వాత తాను రాజకీయాల్లో ఉండబోనంటూ ఆయన చేసిన వాఖ్యలు అప్పట్లో సంచలనం రేకెత్తించాయి. ఆయన తొలగింపు వెనుక పవన్‌కు ఢల్లీి స్థాయిలోఉన్న పరిచయాలు కూడా కారణం అనే వాదనలు వినిపించాయి.
రాష్ట్ర అధ్యక్షుడి పదవిలో ఉన్నపుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇతర పార్టీల విమర్శలు ఎదుర్కొన్నారు. హత్యలు చేసే వారికి ఎయిర్ పోర్టులు ఎందుకంటూ కడప ప్రాంతాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా.. ఆ తర్వాత కడప జిల్లా ప్రజలకు క్షమాపణ కూడా చెప్పారు. ఏపీలో అధికారంలోకి వస్తే రూ.50కే చీప్ లిక్కర్ ఇస్తానంటూ వ్యాఖ్యానించారు. దేశమంతా ఇదే విధానం తెస్తారా అంటూ కేటీఆర్ వంటి వారు ప్రశ్నించడంతో నాలుక్కరుచుకున్నారు.
వీర్రాజును పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి దాదాపు రెండు నెలలు దాటింది. వీర్రాజు అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తున్నారు తప్ప ప్రత్యక్షంగా కనిపించడం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయడం లేదు. కేవలం వైసీపీ గ్రామ పంచాయతీ నిధులు మళ్లింపునకు నిరసనగా కాకినాడలో చేపట్టి నిరసన కార్యకమ్రంలో మాత్రం ఆయన పాల్గొన్నారు. ఏపీ రాజకీయాల్లో యాక్టివ్‌గా, ఎప్పుడూ వార్తల్లో నిలిచే వీర్రాజు మౌనం వెనుక ఆంతర్యం ఏమిటో..?
Gulte Telugu Telugu Political and Movie News Updates