ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ రెండు చోట్లా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సారి మాత్రం పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చినట్లే కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సారి విజయమే లక్ష్యంగా పవన్ ఆచితూచి పోటీచేసే స్థానాన్ని ఎంపిక చేసుకుంటారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయాన్ని ఆయన ప్రకటిస్తారని చెబుతున్నారు.
ప్రస్తుతం విశాఖలో పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర కొనసాగుతోంది. ఈ నెల 19 వరకూ అక్కడే ఈ యాత్ర కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13న గాజువాకలో పవన్ పర్యటిస్తారు. అక్కడ బహిరంగ సభలోనూ పాల్గొంటారు. ఈ సభలోనే ఆయన గాజువాక నుంచి పోటీ చేస్తారో లేదో అనే విషయంపై స్పష్టతనిచ్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో గాజువాకలో పవన్ ఓడిపోయినప్పటికీ.. మరోసారి ఇక్కడి నుంచి బరిలో దిగాలని స్థానిక నేతలు ఆయన్ని కోరుతున్నట్లు సమాచారం.
మరోవైపు ఇటీవల ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ వారాహి యాత్రకు గొప్ప రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లోనూ గోదావరి జిల్లాల్లోని ఓ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మరోసారి భీమవరం బరిలో దిగుతారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి పవన్ మనసులో ఏముందో చూడాలి. మరోసారి గాజువాక, భీమవరం నుంచి పోటీ చేస్తానని ఆయన ప్రకటిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.