ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రం మంత్రి స్మృతి ఇరానీ సందర్భానుసారంగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం సందర్భంగా రాహుల్, ఇరానీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక, మణిపూర్ అల్లర్లపై ప్రసంగించిన అనంతరం ఆయన సభ నుంచి బయటకు వెళ్లారు. ఈ క్రమంలోనే రాహుల్ పై స్మృతి ఇరానీ సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ బయటకు వెళుతూ వెళుతూ తనతో పాటు బీజేపీ మహిళా ఎంపీలను చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆమె షాకింగ్ ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు బీజేపీ మహిళా మంత్రులు, ఎంపీలు ఫిర్యాదు చేశారు. రాహుల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. మణిపూర్ లో భారతమాతను హత్య చేశారని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్మృతీ ఇరానీ మండిపడ్డారు. మణిపూర్ భారత్ లో అంతర్భాగమని, దానిని ఎవరూ విభజించలేరని, ముక్కలు చేయలేరని స్పష్టం చేశారు. భరతమాతను చంపేశారని సభలో ఇప్పటివరకు ఎవరు అనలేదని, రాహుల్ వ్యాఖ్యలను భారతజాతి క్షమించదని అన్నారు.
భారత్ ను హత్య చేశారని రాహుల్ వ్యాఖ్యానిస్తుంటే కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరవడం విడ్డూరమని మండిపడ్డారు. రాహుల్ వంటి వింత ప్రవర్తన సభలో మునుపెన్నడూ చూడ లేదని అసహనం వ్యక్తం చేశారు. స్త్రీ వ్యతిరేకి మాత్రమే ఇలా పార్లమెంట్ లో మహిళా ఎంపీలకు ఫ్లయింగ్ ఇవ్వగలరని మండిపడ్డారు. మహిళల పట్ల రాహుల్ కి ఉన్న గౌరవాన్ని, వారి వంశ చరిత్రను ఈ చర్య తెలియజేస్తుందని నిప్పులు చెరిగారు. అయితే, ఈ వీడియో ఫేక్ అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కావాలనే రాహుల్ గాంధీ పై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates