రాహుల్ గ్రాండ్ ఎంట్రీ.. స్పెషల్ ఎట్రాక్షన్

ఈరోజు లోక్ సభలో స్పెషల్ ఎట్రాక్షనంతా రాహుల్ గాంధీయే. కారణం ఏమిటంటే మణిపూర్ అల్లర్లపై ఇండియా కూటమితో పాటు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై 8,9,10 తేదీల్లో చర్చలు మొదలవ్వబోతున్నాయి. సభ్యులంతా మాట్లాడిన తర్వాత చివరగా నరేంద్రమోడీ సమాధానం చెబుతారు. ఆ తర్వాత ఓటింగ్ జరుగుతుంది. నిజానికి ఓటింగ్ తో ప్రతిపక్షాలు సాధించబోయేది ఏమీలేదని అందరికీ తెలుసు. కాకపోతే విషయం తీవ్రతను దేశంమొత్తానికి తెలియజేయటం, లోక్ సభలో మణిపూర్ అల్లర్లపై చర్చ జరగటమే ప్రతిపక్షాలకు కావాల్సింది.

ఈరోజు మొదలవ్వబోయే చర్చలో అనర్హత వేటుపడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధియే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవబోతున్నారు. ఎందుకంటే తనపై అనర్హత వేటుపడటంతో సుమారు నాలుగు నెలలపాటు రాహుల్ పార్లమెంటుకు దూరంగా ఉన్నారు. సూరత్ కోర్టు వేసిన జైలుశిక్ష దాని ద్వారా పడిన అనర్హత వేటుపై సుప్రింకోర్టు స్టే ఇచ్చింది. దాంతో అనర్హత వేటును లోక్  సభ ఉపసంహరించుకుంది. అన్నీ వైపుల నుండి లోక్ సభ సెక్రటరీపై వచ్చిన ఒత్తిడి కారణంగానే రాహుల్ పై అనర్హత వేటును ఉపసంహరించుకున్నట్లు లోక్ సభ సెక్రటేరియట్ ప్రకటించింది.

అనర్హత ఉపసంహరణ అన్నది అవిశ్వాస తీర్మానం మొదలయ్యే ఒక్కరోజు ముందు కావటం గమనార్హం. దీంతో కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఇండియా కూటమి నేతలు కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. పార్లమెంటులో  స్వీట్లు పంచుకోవటం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన సంతోషాన్ని అందరితో పంచుకున్నది.

మంళగవారం మధ్యాహ్నం మొదలవ్వబోయే అవిశ్వాస తీర్మానంపై చర్చలో రాహుల్ మాట్లాడబోతున్నారు. అవిశ్వాస తీర్మానంలో రాహుల్ మాట్లాడనీయకుండా అన్నీ మార్గాలను మోడీ ప్రభుత్వం పరిశీలించింది. అయితే మార్గమేది కనబడకపోవటంతో వేరేదారిలేక రాహుల్ పై అనర్హత వేటును ఉపసంహరించిందన్న విషయం అందరికీ తెలుసు. అందుకనే ఈరోజు లోక్ సభలో రాహులే ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. ఈమధ్యనే రాజకీయాలను రాహుల్ సీరియస్ గా తీసుకుంటున్న విషయాన్ని అందరు చూస్తున్నారు. దీంతో ఎన్డీయే ప్రభుత్వం, భాగస్వామ్య పార్టీలు కొంత ఇబ్బంది పడుతున్నాయి. కర్నాటకలో రాహుల్ ప్రచారం చేసిన తీరు, అంతకుముందు చేసిన భారత జోడో యాత్రతో ఈ విషయం అర్ధమైంది.