లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ.. ఇతర పార్టీలతో సమాన దూరం పాటిస్తూ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ, సమకాలీన అంశాలపై విశ్లేషణలు చేస్తుంటారు. ఏ పార్టీతోనూ ఆయన సన్నిహితంగా ఉండరు. అలా అని వైరం కూడా పెట్టుకోరు. కానీ తాజాగా జేపీ.. ఏపీ అధికార పార్టీ వైసీపీకి దగ్గరవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం జగన్‌తో జేపీ చాలా సేపు ముచ్చటించడమే అందుకు కారణమని తెలుస్తోంది.
మాజీ ఐఏఎస్ అధికారి అయిన జేపీ 2009 ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2014లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా ఓడిపోయారు. అప్పటి నుంచి వివిధ సమస్యలపై తన గళాన్ని వినిపిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ మెట్రో విస్తరణపై జేపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తాజాగా విజయవాడలో ఓ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్‌తో కలిసి జేపీ కనిపించారు. మంత్రి జోగి రమేష్‌తో జేపీని పిలిపించుకుని మరీ జగన్ తన పక్క సీట్లో కూర్చోబెట్టుకున్నారు.
జగన్, జేపీ ఇలా పక్కపక్కనే కూర్చుని చాలా సేపు మాట్లాడుకున్నారు. ఇటీవల వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను కొన్నింటిని జేపీ ప్రశంసించారు. మరోవైపు ఎన్నికలకు ముందు జగన్‌కు కొంతమంది ఐఏఎస్‌లు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో జేపీ వైసీపీలో చేరతారేమోననే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆయన పార్టీలో చేరితే విజయవాడ లేదా గుంటూరు నుంచి ఎంపీగా బరిలో దించే అవకాశముందని తెలిసింది. ఒకవేళ పార్టీలో చేరకుండా బయట నుంచి మద్దతు ఇచ్చినా.. ఇది జనసేన, టీడీపీలకు పెద్ద దెబ్బే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.