ఇపుడీ విషయమే తెలుగుదేశం పార్టీలో బాగా చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే చాలాకాలంగా గల్లా పార్టీకి దూరంగా ఉంటున్నారు. యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు స్వయంగా చంద్రబాబునాయుడుకే చెప్పేశారు. అందుకనే పాలిట్ బ్యూరో సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అప్పటినుండి నియోజకవర్గంలో, పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించటంలేదు. అలాంటిది ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో యాక్టివ్ అవుతున్నారట. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ చంద్రగిరి నుండే పోటీచేయాలనే ప్లాన్లో ఉన్నట్లు జోరుగా ప్రచారం మొదలైంది.
ఇక్కడ గల్లా అంటే గల్లా అరుణకుమారి అని మాత్రమే గల్లా జయదేవ్ కాదు. మొదటి నుండి అరుణకుమారి చంద్రగిరిలోనే పోటీచేస్తున్నారు. మూడుసార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ ఎంఎల్ఏ అనిపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏకంగా పదేళ్ళు మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరి కొడుకు గల్లా జయదేవ్ కు గుంటూరు ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు. కొడుకు గుంటూరు ఎంపీగా తాను చంద్రగిరి ఎంఎల్ఏగా పోటీచేశారు. కొడుకు గెలిచినా తాను ఓడిపోయారు.
అప్పటినుండి యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దాదాపు 75 ఏళ్ళ వయస్సున్న అరుణకుమారి రాజకీయాల నుండి తప్పుకున్నట్లుగానే చెప్పారు. వ్యక్తిగత కారణాలతో ఎంపీ జయదేవ్ కూడా రాబోయే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండబోతున్నట్లు స్వయంగా చంద్రబాబుకే చెప్పారు. గుంటూరు ఎంపీ అభ్యర్ధిగా ఇంకెవరినైనా గట్టినేతను చూసుకోమని జయదేవ్ కొంతకాలం క్రితం చంద్రబాబుకు చెప్పేశారు. అంటే రాబోయే ఎన్నికల్లో తల్లి, కొడుకులు ఎన్నికల్లో ఎక్కడా కనబడరనే అందరు అనుకుంటున్నారు.
అలాంటిది సడెన్ గా అరుణ మళ్ళీ పార్టీలో యాక్టివ్ అవుతున్నట్లు తమ్ముళ్లు చెబుతున్నారు. చంద్రగిరిలో రెగ్యులర్ గా తిరుగుతున్నారట. నియోజకవర్గంలోని నేతలు, ముఖ్యులతో భేటీలవుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే చంద్రగిరిలో పోటీచేసే విషయంలో అరుణ ఆసక్తిగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే పులివర్తి నానీని నియోజకవర్గానికి ఇన్చార్జిగా ప్రకటించారు. అయితే నాని కన్నంతా చంద్రగిరి మీదకన్నా చిత్తూరు మీదే ఎక్కువుంది. అలాంటిది ఇపుడు అరుణ చంద్రగిరిలో యాక్టివ్ అవుతుంటే ఆమెను ఇన్చార్జిగా ప్రకటించి నానీకి చిత్తూరును అప్పగించే అవకాశాలు లేకపోలేదని పార్టీలో చెప్పుకుంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.