తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అక్కడి కేటీఆర్ ల్యాబీ ముందు నేతలు క్యూ కడుతున్నారు. కేటీఆర్‌తో మాట్లాడేందుకు గంటలు గంటలు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో సీఎం కేసీఆర్ తర్వాత కీలక నాయకుడు ఎవరంటే ఎక్కువగా వినిపించే పేరు కేటీఆర్. తండ్రికి తగ్గ తనయుడిగా ఎదుగుతున్న ఆయన.. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలు చూస్తూనే, ఐటీ మంత్రిగా ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో టికెట్ ఆశిస్తున్న నేతలు, వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు.. ఇప్పుడు కేటీఆర్ దర్శనం కోసం ఎగబడుతున్నారని తెలిసింది.
కేటీఆర్ చెబితే టికెట్ దక్కడం పక్కా అనే అభిప్రాయం పార్టీ నేతల్లో నెలకొంది. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన కేసీఆర్.. ఇక్కడ రాష్ట్రంలో కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దీంతో కేటీఆర్‌తో మాట్లాడేందుకు నేతలు భారీగా తరలి వస్తున్నారు.
ఇలా వస్తున్న నేతల సంఖ్యను చూసి కేటీఆర్ కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల విరామ సమయంలో తన ల్యాబీకి కేటీఆర్ వెళ్లేటప్పటికే భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు అక్కడ వేచి చూస్తున్నారు. దీంతో వీళ్లందరూ ఎందుకు వచ్చారు, ఎవరు రానిచ్చారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది.
తన కోసం వచ్చిన నేతల్లో కొందరిని పిలిపించుకుని కేటీఆర్ మాట్లాడినట్లు సమాచారం. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇచ్చే విషయం, అసంతృప్తి నేతలను బుజ్జగించే పనులతో కేటీఆర్ బిజీగా గడిపినట్లు తెలిసింది. ఇలా మొత్తానికి కేటీఆర్ కరుణ కోసం నాయకులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారని టాక్.