అసెంబ్లీ అంటేనే కేసీయార్ ఎంత భయపడుతున్నారనే విషయం బయటపడింది. అసెంబ్లీకి భయపడడం అంటే అసెంబ్లీకి అని కాదు అసెంబ్లీలో ప్రతిపక్షాలను ఫేస్ చేయటానికని అర్ధం. ఎందుకంటే మామూలుగా అయితే వర్షాకాల సమావేశాలు కనీసం వారం రోజులైనా జరుగుతాయి. అలాంటిది తాజా సమావేశాలను మూడంటే కేవలం మూడే రోజులు జరపాలని డిసైడ్ చేశారు. గురువారం అసెంబ్లీ ప్రారంభమైనా చనిపోయిన ఎంఎల్ఏలు, మాజీ ఎంఎల్ఏలకు సంతాపం చెప్పటంతో సభను వాయిదా వేశారు.
అంటే అసెంబ్లీ సమావేశాలు శుక్ర, శని, ఆదివారం లేకపోతే సోమవారం జరిగి ముగుస్తుంది. మూడురోజుల సమావేశాల్లో సభ్యులు ఎన్ని సమస్యలను చర్చించగలరు ? అసలు మూడురోజుల్లో సమావేశాలు ముగించేట్లయితే ఇక సమావేశాలు నిర్వహించటం ఎందుకు ? డబ్బు దండగ. రైతురుణమాఫీ, విద్య, వైద్యంతో పాటు భారీ వర్షాలు, వరదల పరిస్ధితి, పునరావాస కార్యక్రమాలను చేపట్టడంలో ప్రభుత్వ వైఫల్యం, దళిత, బీసీ బంధు తదితర పథకాల అమలుపై చర్చించాలని ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి.
అందుకనే కాంగ్రెస్ పార్టీ సమావేశాలను కనీసం పదిరోజులు నిర్వహించాలని డిమాండ్ చేసింది. బీజేపీ అయితే సమావేశాలను 30 రోజులు నడపాలని సూచించింది. అయితే ప్రతిపక్షాల సూచనల్లో దేన్నీ కేసీయార్ ఆమోదించలేదు. స్పీకర్ పోచారం శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీని మూడు రోజులు జరపాలని డిసైడ్ అయ్యింది. ప్రతిపక్షాలు డిమాండ్ చేసినట్లుగా పదిరోజులు లేదా 30 రోజులు సమావేశాలు జరిగితే తట్టుకోవటం కష్టమని కేసీయార్ కు బాగా అర్ధమైపోయింది.
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి కాంగ్రెస్, బీజేపీ ఎంఎల్ఏలు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం బాగా అర్ధమవ్వటంవల్లే సమావేశాలను మూడురోజుల్లోనే ముగించేయాలని కేసీయార్ డిసైడ్ చేశారు. కేసీయార్ ఆలోచనలకు అనుగుణంగానే బీఏసీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి మూడురోజుల సమావేశాలకు పట్టుబట్టి ఒప్పించారు. దీంతోనే ప్రతిపక్షాలను ఫేస్ చేయాలంటే కేసీయార్ ఎంతగా భయపడుతున్నారో అర్ధమైపోతోంది. ఇక్కడ అసెంబ్లీలో అంటే తప్పించుకున్నారు కానీ రేపటి ఎన్నికల్లో జనాల్లోని వ్యతిరేకతను ఎలా తప్పించుకుంటారు ?