ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా వైరస్… ఏపీలో కూడా తనదైన శైలి విశ్వరూపం చూపుతోంది. రోజుకు 10 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్న తీరే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. అంతేనా… దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో పదో వంతుకు పైగా కేసులు ఏపీలో నమోదైనవే కావడం గమనార్హం. అలాంటిది ఇప్పుడు ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్టుగా కనిపిస్తోంది. రోజూ క్రమం తప్పకుండా ప్రభుత్వం విడుదల చేస్తున్న బులెటిన్ లో ఈ తరహా గణాంకాలు కనిపిస్తున్నాయి. సోమవారం నాడు 6,780 కొత్త కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్న తరుణంలో శుక్రవారం 7 వేల లోపే కేసులు నమోదయ్యాయంటే… కరోనా వ్యాప్తి తగ్గినట్టే కదా. అయితే ఇక్కడే ఓ జిమ్మిక్కు ఉన్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. కరోనా వ్యాప్తి తగ్గిపోయిందన్న భావన వ్యక్తమయ్యేలా కొత్త కేసుల సంఖ్యను తగ్గించి చూపడమే లక్ష్యంగా జగన్ సర్కారు సాగుతోందన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇందుకోసం రోజూ చేస్తున్న టెస్టుల సంఖ్యను ప్రభుత్వం తగ్గించిందన్నది కొందరి వాదనగా వినిపిస్తోంది. ఈ వాదన నిజమేనన్నట్లుగా సర్కారు విడుదల చేసిన గణాంకాల్లోనూ టెస్టుల సంఖ్య తగ్గించినట్లుగా స్పష్టంగా కనిపిస్తున్న వైనం ఈ వాదనలకు బలం చేకూరుస్తోందని చెప్పక తప్పదు.
ఈ లెక్క ఎలాగన్న విషయానికి వస్తే… మొన్నటిదాకా దేశంలోనే అత్యథిక టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఈ విషయాన్ని జగన్ సర్కారు కూడా బాగానే చెప్పుకుంది. అయితే ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా మారిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. శుక్రవారం నాటి సర్కారు బులెటిన్ చూస్తేనే ఈ విషయం అర్థమైపోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 44,578 టెస్టులు చేయగా… 6,780 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. అదే సమయంగా గడచిన కొన్ని రోజుల్లో ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ లో జరిగిన టెస్టులు, నమోదైన కొత్త కేసుల విషయాన్ని పరిశీలిస్తే… ఆదివారం(16-8-2020)నాడు 48,746 టెస్టులు చేయగా… 8,012 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు అంటే.. శనివారం నాడు 53,712 టెస్టులు చేయగా 8,732 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక ఆ ముందు రోజు అంటే… శుక్రవారం నాడు 53,026 టెస్టులు చేయగా 8,943 కొత్త కేసులు, గురువారం నాడు 55,692 టెస్టులు చేయగా 9,996 కొత్త కేసులు, బుధవారం నాడు 57,148 టెస్టుటు చేయగా 9,597 కేసులు, మంగళవారం నాడు 58,315 టెస్టులు చేయగా 9,024 కేసులు, సోమవారం నాడు 46,999 టెస్టులు చేయగా 7,665 కేసులు నమోదయ్యాయి. ఇక ఆ ముందు రోజు అంటే ఆదివారం(9-8-2020) నాడు 62,912 టెస్టులు చేయగా 10,820 కొత్త కేసులు కేసులు నమోదయ్యాయి.
అంటే… ప్రభుత్వం రోజూ 50 వేలకు పైగా టెస్టులు చేస్తున్న వైనం తన ప్రకటనల్లోనే స్పష్టంగా కనిపిస్తోందని చెప్పాలి. అయితే రోజూ 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్న తరుణంలో… పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇబ్బంది అనుకున్నారో, ఏమో తెలియదు గానీ… కొత్త కేసుల సంఖ్యను తగ్గించి చూపేందుకు ఏకంగా టెస్టుల సంఖ్యనే తగ్గించేశారన్న మాట. టెస్టుల సంఖ్య గతంలో ఏకంగా 70 వేల మార్కును దాటినా… ఇటీవలి కాలంలో ఈ సంఖ్య 50 వేలకు కుదించుకుపోయింది. అయినా కొత్త కేసుల సంఖ్య రోజూ 10 వేలను దాటుతున్న నేపథ్యంలో కేసుల సంఖ్యను మరింత తగ్గించేందుకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న వాదనలు వినిపిస్తున్ానయి. ఈ క్రమంలో క్రమంగా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుండగా… కొత్త కేసుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోందన్న మాట. మరి ఈ లెక్కను చూస్తే… ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్టా? లేదా ఇంకా భీకరంగానే ఉన్నటా? అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది.