వివేకా హత్య కేసులో ఇటీవల సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటు సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఆ చార్జీషీటులో వైైఎస్ సునీత చేసిన ఆరోపణలు రాజకీయ కాక రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ హత్యకు సంబంధించి సీబీఐ అధికారులకు మాజీ సీఎస్ అజేయ కల్లం ఇచ్చిన స్టేట్ మెంట్ కూడా చర్చనీయాంశమైంది. అయితే, తాజాగా ఆ చార్జిషీట్లో తాను చెప్పిన విషయాలపై అజేయ కల్లం స్పందించారు. ఈ సందర్భంగా సీబీఐ అధికారులపై అజేయ కల్లం సంచలన ఆరోపణలు చేశారు.
తాను ఇచ్చిన స్టేట్మెంట్ ను సీబీఐ మార్చేసిందని అజేయకల్లం షాకింగ్ కామెంట్లు చేశారు. 2023 ఏప్రిల్ 29న తన వాంగ్మూలాన్ని సీబీఐ రికార్డు చేసిందని, కానీ, తాను చెప్పింది ఒకటని…ఛార్జ్ షీట్ లో సీబీఐ పేర్కొంది మరొకటని అజేయ కల్లం అన్నారు. 2019 మార్చి 15న జగన్ నివాసంలో సమావేశం జరుగుతుండగా అటెండర్ వచ్చి డోర్ కొట్టారని అజేయకల్లం చెప్పారు. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి జగన్ కు ఏదో చెప్పగానే ఆయన షాక్ కు గురై లేచి చిన్నాన్న చనిపోయారని చెప్పారని అన్నారు. ఆ విషయాన్ని తాను సీబీఐకి చెప్పానని, ఇంతకు మించి మరేమీ చెప్పలేదని తెలిపారు.
సీబీఐకి తాను ఇచ్చిన వాంగ్మూలంలో జగన్ భార్య భారతి ప్రస్తావనగానీ, వేరే విషయాలనుగానీ తాను సీబీఐ విచారణలో వెల్లడించలేదని అన్నారు. తాను చెప్పనివి సీబీఐ ఛార్జ్ షీట్ లో ఉన్నాయని, అవన్నీ అబద్ధాలేనని క్లారిటీనిచ్చారు. దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా సీబీఐ వ్యవహరిస్తోందని అన్నారు. తన స్టేట్మెంట్ గా పేర్కొన్న అంశాలను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో అజేయకల్లం పిటిషన్ దాఖలు చేశారు.