కొద్దిరోజుల క్రితం తమిళ హీరో నటించిన డబ్బింగ్ మూవీ ‘‘ఆదిరింది’’ (తమిళంలో మెర్సెల్) గుర్తుందా? అందులో రూ.5లకే వైద్యం అందించే పాత్ర ఉంది.. గుర్తుకు వచ్చిందా? రీల్ లో కనిపించే ఆ పాత్ర..రియల్ లైఫ్ లోని తిరువేంకటం అనే పెద్దాయన స్ఫూర్తిగా తీసుకున్నారు. అవకాశం లభిస్తే చాలు.. లక్షలకు లక్షలకు దండుకునే వైద్యులు మన చుట్టు ఉన్న రోజుల్లోనే కేవలం రూ.5లకే వైద్యాన్ని అందించే ఆయన తాజాగా కన్నుమూశారు.
చెన్నైలోని దక్షిణ రైల్వే ఆసుపత్రిలో ఆయన మరణించారు. 70 ఏళ్ల ఆయనకు ఛాతీ నొప్పి రావటంతో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు చేసిన చికిత్సతో కొంత కోలుకున్నారు. దీంతో.. ఆయన్ను శనివారం డిశ్చార్జి చేయాలని నిర్ణయించారు. అనుకోని రీతిలో చోటు చేసుకున్న పరిణామంతో ఆయన కన్నుమూసినట్లుగా చెబుతున్నారు. ఆయనకు భార్య.. కుమార్తె.. కుమారుడు ఉన్నారు.పిల్లలు ఇద్దరు వైద్యులు కావటం విశేషం.
1973లో నార్త్ చెన్నైలోని వ్యాసరపాడికి చెందిన ఆయన వైద్యాన్ని చేసేవారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం రూ.5లకే వైద్యం చేయటం ఆయన ప్రత్యేకత. ఆయన ఆసుపత్రికి వస్తున్నారంటే చాలు.. క్లినిక్ రోగులతో కిటకిటలాడేది. అంతేకాదు.. ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా వైద్యసేవల్ని అందించటం ఆయనకు మాత్రమే సాధ్యమని చెప్పాలి.
వైద్యుడిగా ప్రాక్టీస్ మొదలు పెట్టిన తర్వాత కరోనా వేళలో ఒక్క నెల రోజులు మాత్రమే క్లినిక్ ను మూసి ఉంచారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతారు. ఆ సమయంలోనూ రోగులకు తన ఫోన్ నెంబరు ఇచ్చి.. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయమని చెప్పే వారని చెబుతారు.
ఫోన్ లో ఎవరైనా తమకున్న ఆరోగ్య సమస్య గురించి చెబితే.. మందులు చెప్పి వైద్యం చేసేవారు. పేదలకు నిష్పక్షపాతంగా వైద్యం చేసే ఐదు రూపాయిల వైద్యుడి మరణంపై తమిళనాడు ముఖ్యమంత్రితో సహా పలువురు నేతలు సంతాపాన్ని తెలియజేశారు. ఇలాంటి వారి మరణం.. వేలాది మంది పేదలకు తీరని నష్టం కలుగజేస్తుందని చెప్పక తప్పదు.