ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. వాలంటీర్లు సేకరించిన డేటా సంఘ విద్రోహ శక్తులకు వెళుతోందని, ఏపీలో దాదాపు 30 వేల మహిళలు మిస్సింగ్ అంటూ పవన్ చేసిన కామెంట్లు కాక రేపాయి. అయితే, పవన్ వి కాకి లెక్కలు అని వైసీపీ నేతలు కొట్టి పారేశారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ చెప్పిన గణాంకాలు కరెక్టేనని ఏకంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇవ్వడంతో వైసీపీ నేతలకు షాక్ తగిలింది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం ఏపీలో 2019 నుంచి 2021వరకు మూడేళ్లలో 7వేల 928 మంది బాలికలు. .22వేల 278 మంది మహిళలు అదృశ్యమయ్యారని ఆయన వెల్లడించారు. అదే, తెలంగాణలో 8వేల 66 మంది బాలికలు, 34 వేల 495 మంది మహిళల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ మహిళా కమిషన్ పై పవన్ మండిపడ్డారు. కేంద్రమంత్రి కూడా తాను చెప్పిన గణాంకాలే చెప్పారని, ఇప్పుడు మహిళా కమిషన్ ఏం చేస్తుందని ప్రశ్నించారు.
ఏపీలో బాలికలు, మహిళలు ఎందుకు అదృశ్యమవుతున్నారని పవన్ ప్రశ్నించారు. ఈ మిస్సింగ్ కేసులపై హోంమంత్రి, డీజీపీని.. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ వివరణ అడగగలదా? అని పవన్ నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంపై మహిళా కమిషన్ చర్యలు తీసుకోగలదా అని ప్రశ్నించారు. జగన్ పాలనలో భారీ సంఖ్యలో బాలికలు, మహిళలు అదృశ్యం అయ్యారని పవన్ అన్నారు.
ఈ నేపథ్యంలోనే పవన్ కామెంట్లపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 26 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, వారిలో 23 వేల మందిని గుర్తించామని చెప్పారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని అన్నారు. రకరకాల కారణాలతో వీరు అదృశ్యమయ్యారని చెప్పారు. కానీ, అవగాహన లేని కొందరు 30 వేల మంది మిస్సింగ్ అంటూ తప్పుడు లెక్కలు చెపుతున్నారని ఆరోపించారు. ఏపీలో ప్రతి ఘటనకు గంజాయితో ముడిపెట్టడం సరికాదని డీజీపీ అన్నారు. గంజాయిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates