భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ప్రమాదంలో పడేలా కనిపిస్తోంది. వరద ముప్పు పొంచి ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఈ ప్రాజెక్టుకు 3 లక్షల 87 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 697 అడుగులకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 700 అడుగులుగా ఉంది. ఈ భారీ వర్షం కారణంగా మరింత వరద ప్రవాహం ప్రాజెక్టును చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందో అనే భయం నెలకొంది.
ప్రాజెక్టులో వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 14 గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. దీంతో 2 లక్షల 47 వేల క్యూసెక్కుల నీరు కిందకు వెళ్తోంది. గేట్లు తెరవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ నెల 15 నుంచి నిరంతరంగా వరద వస్తుండడంతో ఈ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రస్తుత ప్రమాద పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు దగ్గరకు పర్యాటకులను, ప్రజలను అనుమతించడం లేదు.
ప్రాజెక్టు పూర్తి నీట మట్టానికి చేరే అవకాశం ఉండడంతో పరిస్థితిని ఎప్పటికప్పుడూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వరద ముంపును తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో తమ రక్షణ కోసం అధికారుల సూచలను ప్రజలు పాటించాలని కోరుతున్నారు.