ఉమెన్ ట్రాఫికింగ్.. ఏపీ, తెలంగాణ‌ల లెక్క తేల్చిన కేంద్రం!

ఉమెన్ ట్రాఫికింగ్‌. ఈ విష‌యం ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా చ‌ర్చ‌కు వ‌చ్చిన విష‌యం. వారాహి యాత్ర 2.0 చేప‌ట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏలూరులో నిర్వ‌హించిన స‌భ‌లో ఉమెన్ ట్రాఫికింగ్‌లో ఏపీ ముందుంద‌ని, వ‌లంటీర్లు పెద్ద ఎత్తున దీనిని ప్రోత్స‌హిస్తున్నార‌ని వ్యాఖ్యానించి రాజ‌కీయ దుమారానికి తెర‌దీశారు. ఇక‌, ప‌వ‌న్‌కు వైసీపీ నుంచి అదే రేంజ్‌లో ఎదురు దాడి వ‌చ్చింది. స‌రే.. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ఉమెన్ ట్రాఫికింగ్‌పై లెక్క తేల్చింది.

పార్ల‌మెంటులో ఈ రోజు ఏపీ స‌భ్యుడు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పిన కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి.. ఉమెన్ ట్రాఫికింగ్ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. దీని ప్ర‌కారం.. ఉమెన్ ట్రాఫికింగ్ విష‌యంలో తెలంగాణ రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల్లోనూ ముందుండ‌డం షాకింగ్ అంశంగా మారింది. కేంద్రం వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. 2019-21 సంవ‌త్స‌రాల మ‌ధ్య.. అంటే రెండేళ్ల కాలానికి తెలంగాణ‌లో ఏకంగా 8099 మంది బాలిక‌లు, 34,495 మంది మ‌హిళ‌లు అదృశ్య‌మ‌య్యార‌ని కేంద్రం వెల్ల‌డించింది.

ఇదే స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికి వ‌స్తే.. 7928 మంది బాలిక‌లు క‌నిపించ‌కుండా పోయార‌ని కేంద్రం తెలిపింది. అదేవిధంగా 22278 మంది మ‌హిళ‌లు 2019-21 మ‌ధ్య క‌నిపించ‌కుండా పోయార‌ని వివ‌రించింది. అయితే.. ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు వీరిని గుర్తించేందుకు శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నాయ‌ని.. కేంద్రం పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. ఏపీలో రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా ఉమెన్ ట్రాఫికింగ్‌ను అరిక‌ట్టేందుకు ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసేలా నిర్ణ‌యం తీసుకోనుంద‌ని మంత్రి తానేటి వ‌నిత వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.