వంగ‌వీటి వార‌సురాలు వ‌స్తున్నారా?

వంగ‌వీటి రంగా.. విజ‌య‌వాడ‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లోనూ కీల‌క పాత్ర పోషించిన దివంగ‌త నాయ‌కుడు. బెజ‌వాడ రాజకీయాల్లో ఆయ‌న ఆధిప‌త్యం గొప్ప‌గా సాగింది. ఈ సారి ఏపీ ఎన్నిక‌ల్లో ఆయ‌న పేరు నిల‌బెట్టాల‌నే ల‌క్ష్యంతో.. వంగ‌వీటి రంగా కుమార్తె ఆశాల‌త రాజ‌కీయం రంగ‌ప్ర‌వేశం చేయ‌బోతున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. తండ్రి వార‌స‌త్వాన్నిపుణికిపుచ్చుకుని రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసేందుకు ఆమె రానున్నార‌ని, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి పోటీ చేయ‌నున్నార‌ని స్థానిక రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ సాగుతోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల్లో రంగా కుటుంబానికి రాజ‌కీయంగా మంచి ప‌ట్టున్న విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి ఆశాల‌త‌ను పోటీ చేయించే అవ‌కాశాలున్నాయి. ఇందుకు ఆమె మేన‌మామ గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం. వంగ‌వీటి రంగా హ‌త్య త‌ర్వాత ఆయ‌న భార్య ర‌త్న‌కుమారి ఎమ్మెల్యే అయ్యారు. రంగా కుమారుడు రాధా కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ వీళ్లు పెద్ద‌గా హ‌వా కొన‌సాగించ‌లేక‌పోతున్నార‌నే అభిప్రాయాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం రాధా రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నా బ‌య‌ట ఎక్కువ‌గా క‌నిపించ‌డం లేదు.

రంగా వార‌స‌త్వాన్ని ఉప‌యోగించుకుని విజ‌య‌వాడ‌తో పాటు గోదావ‌రి జిల్లాల్లో కాపు సామాజిక వ‌ర్గాన్ని ఆక‌ట్టుకోవ‌డం కోసం ఆశాల‌త‌ను చేర్చుకోవ‌డానికి వివిధ పార్టీలు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు సమాచారం. రంగా అభిమానుల బ‌లమే ఆశాల‌త‌ను గెలిపిస్తుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుత ప‌రిణామాలు చూస్తుంటే రంగా వార‌సురాలిగా ఆశాల‌త రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేయ‌డం ఖాయ‌మేన‌నిపిస్తోంది. మ‌రి ఆమె ఏ పార్టీలో చేర‌తార‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.