టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. యువగళం పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్‌ను చుట్టేస్తున్నారు. వర్షంలోనూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ యాత్రలో ఆయన ప్రదర్శించిన ఓ ఎర్ర రంగు అట్టతో ఉన్న పుస్తకం చర్చనీయాంశంగా మారింది. ఆ రెడ్‌బుక్ ఏమిటీ? అనే ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై ఎట్టకేలకు లోకేష్ సమాధానమిచ్చారు. ఆ రెడ్‌బుక్ గుట్టు ఏమిటో బయటపెట్టారు.
ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న జగన్ మెప్పు పొందేందుకు కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించి, చట్టాలను చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. ఇలా ఇష్టానుసారం వ్యవహరిస్తూ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న వారందరి పేర్లు ఈ రెడ్‌బుక్‌లో రాస్తున్నట్లు లోకేష్ వెల్లడించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెడ్‌బుక్‌లో నమోదు చేసిన అందరిపై న్యాయపరమైన విచారణ జరిపిస్తామని లోకేష్ చెప్పారు. బాధ్యులను తప్పకుండా శిక్షిస్తామన్నారు. సీఎం కోసం నిబంధనలను ఉల్లంఘిస్తున్న అధికారుల లెక్కతేల్చే పుస్తకమే ఇది అని బహిరంగ సభలో ఈ రెడ్‌బుక్‌ను చూపించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జరిగిన సభలో లోకేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. మరి ఆయన ఇప్పటివరకూ ఎంతమంది పేర్లు నమోదు చేశారో? అసలు టీడీపీ అధికారంలోకి వస్తుందా? అని వైసీసీ వర్గాలు వెటకారంగా మాట్లాడుతున్నాయి.