వైసీపీ ఎంపీల్లో మైన‌స్‌లు.. ఎంద‌రంటే..!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఎన్నిక‌ల లెక్క‌లు మారుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఎమ్మెల్యేల ప‌నితీరు.. వారి గ్రాఫ్‌పైనే పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ దృష్టి పెట్టారు. వారిని అదిలిస్తున్నారు.. క‌దిలిస్తున్నారు.. ప్ర‌జ‌ల చెంత‌కు పంపిస్తున్నారు. జాగ్ర‌త్త‌గా లేక‌పోతే.. టికెట్ ద‌క్క‌ద‌ని కూడా హెచ్చ‌రిస్తున్నారు. స‌రే.. ఇదంతా బాగానే ఉంది. మ‌రి ఎంపీల మాటేంటి? వారి లెక్క‌ల ప‌రిస్థితి ఏంటి? అనేది మాత్రం ప్ర‌స్తుతానికి ప‌క్క‌న పెట్టారు.

కానీ, అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో మాత్రం ఎంపీల్లో మైన‌స్‌లు ఎవ‌రు? ప్ల‌స్‌లు ఎవ‌రు? అనే చ‌ర్చ సాగుతున్నట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం లోక్‌స‌భ‌కు సంబంధించి వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఒక‌రు రెబ‌ల్ అయిన విష‌యం తెలిసిందే. ఇక‌, మిగిలిన 21 మందిలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. వారికే క‌నుక టికెట్లు ఇస్తే.. గెలిచేది కేవ‌లం 7-8 మంది మాత్ర‌మేన‌ని లెక్క‌లు తేలుతుండ‌డం.. అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో చ‌ర్చ‌కు వ‌స్తుండ‌డం సంచ‌లనంగా మారింది.

గెలిచే వారిక‌న్నా.. ఓడే వారే ఎక్కువ‌ని చెబుతున్నారు. ఓట‌మి ఎదుర్కొనే ఎంపీల జాబితాలో మ‌హిళా నాయ‌కులు కూడా ఉన్నార‌ని వైసీపీలో చ‌ర్చ సాగుతోంది. ఇక‌, ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. ఫ‌స్ట్ పోయే సీటు హిందూపురం, నెక్ట్స్ పోయే సీటు రాజ‌మండ్రి అని కీల‌క నాయ‌కులు ఘంటా ప‌థంగా చెబుతున్నారు. ఇక‌, కాకినాడ‌, అర‌కు ఎంపీ సీట్లు కూడా ఓట‌మి అంచుల్లో ఉన్నాయ‌ని అంటున్నారు.

ఏలూరు, క‌ర్నూలు, బాప‌ట్ల ఎంపీ స్థానాలు ఫిఫ్టీగా ఉన్నాయ‌ని అయితే.. ప్ర‌తిప‌క్షాల దూకుడు పెరిగి.. ఇక్క‌డ క‌నుక లెక్క‌లు మారితే.. గెలుపు గుర్రం ఎక్క‌డం సాధ్యం కాద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక‌, విజ‌య న‌గ‌రం, నంద్యాల, అన‌కాప‌ల్లి ప‌రిస్థితి కూడా ఇలానే ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంపీ అభ్య‌ర్థుల‌ను మారిస్తే త‌ప్ప‌.. మార్పు క‌నిపించ‌డం క‌ష్ట‌మ‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. క‌డ‌ప‌లో ఈ సారి ఓట‌మి ఖాయ‌మ‌ని అంటున్నారు. మిథున్‌రెడ్డి గెలుపు గుర్రం ఎక్కుతార‌ని అంచ‌నా ఉంది. ఈ నేప‌థ్యంలో ఎంపీల ప‌రిస్థితి మైన‌స్‌ల‌లోనే ఉంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌రి జ‌గ‌న్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.