ఏపీ సీఎం జగన్ రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో ఆయనపై నమోదైన ఆస్తుల కేసులకు సంబంధించి ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కూడా ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అంతేకాదు.. ఆయన కూడా కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. అయితే.. తాజాగా ఆయనకు సంబంధించి నమోదైన కేసులను కొట్టి వేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పువెలువరించింది. ముఖ్యంగా వాడరేవు, నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్(వాన్‌పిక్)కు అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేటాయించిన భూములను ఇచ్చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులను ఆదేశించింది. దీంతో ఈ కేసుల నుంచినిమ్మగడ్డ కు పూర్తిస్థాయిలో ఊరట లభించినట్టయిందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి.
వైఎస్ హయాంలో యూఏఈలోని రస్-అల్‌ఖైమాకు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో వాన్‌పిక్‌ను స్పెషల్ పర్పస్ వెహికల్‌గా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వాన్‌పిక్ అభివృద్ధికి సంబంధించి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 13,220 ఎకరాల భూమిని ప్రభుత్వం అప్పట్లో కేటాయించింది. వీటిలో గుంటూరులోని 1416 ఎకరాలు, ప్రకాశం జిల్లాలోని 11,804 ఎకరాలు ఉన్నాయి. అయితే.. ఈ భూముల్లోనూ గుంటూరలో కేటాయించిన భూములు పట్టా భూములు అయితే.. ప్రకాశంలో కేటాయించిన భూములు అసైన్డ్ భూములు. సరే.. ఇది ఎలా ఉన్నా.. జగన్ ఆస్తుల కేసులు విచారించిన సీబీఐ.. ఈ భూముల విషయాన్ని విచారించింది.
నిమ్మగడ్డకు.. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేటాయించిన ఈ భూములు.. క్విడ్ ప్రోకో కింద కేటాయించినవేనని పేర్కొంది. ఈ భూములు నిమ్మగడ్డ కు చేరిన తర్వాత.. ఆయన జగన్‌కు చెందిన సంస్థల్లో రూ.కోట్లు పెట్టుబడులు పెట్టారని పేర్కొంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు ఆయా భూములను జప్తు చేశారు. ఇది 2014, 2017 సంవత్సరాల్లో జరిగాయి. అయితే.. ఇలా జప్తు చేయడాన్ని నిమ్మగడ్డ ప్రసాద్.. ఈడీ అప్పలేట్ అథారిటీలో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన అప్పిలేట్ అథారిటీ.. అటాచ్ చేయడాన్ని తప్పుబట్టింది. దీంతో 2022లోనే ఒకింత ఊరట లభించింది.
తాజాగా ఈ కేసును విచారిస్తున్న తెలంగాణ హైకోర్టు.. నిమ్మగడ్డ ప్రసాద్ కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. గతంలోనే పట్టా భూములకు సంబంధించి జప్తును రద్దు చేశామన్నకోర్టు.. ఇప్పుడు అసైన్డ్ భూముల విషయంలోనూ అదే తీర్పు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆయా భూముల జప్తును రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. వెంటనే ఆయా భూములను ఈడీ తిరిగి అప్పగించాలని ఆదేశిస్తూ.. తీర్పు వెలువరించింది. ఫలితంగా నిమ్మగడ్డ ప్రసాద్‌కు ఈ కేసుల నుంచి విముక్తి లభించినట్టేనని ఆయన తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.