ఏపీ, తెలంగాణ బీజేపీలకు కొత్త అధ్యక్షులు వీరే

గత కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీ వ్యవహారాలు ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను తప్పించబోతున్నారని, ఆ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును కూడా తప్పించబోతున్నారని పుకార్లు వస్తున్నాయి. తాజాగా, ఆ పుకార్లకు తగ్గట్లుగానే అయితే తెలంగాణ, ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షులను ప్రకటించారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువడింది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరికి దక్కింది. అనూహ్యంగా చివరి నిమిషంలో ఆమె పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. ఇక, ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేసి చెప్పారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి రేసులో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే బిజెపి హై కమాండ్ కిషన్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఈటలతోపాటు రఘు నందన్ రావు కూడా పార్టీపై అలకబూనారని ప్రచారం జరిగినా..తాను బిజెపికి విధేయుడినని, బిజెపిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని రఘునందన్ రావు వివరణ ఇచ్చారు. కాగా, సోము వీర్రాజుకు రాష్ట్ర స్థాయిలోనే ఇతర బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. బండి సంజయ్ కు కేంద్ర స్థాయలో లేదా రాష్ట్ర స్థాయిలో పదవి దక్కే అవకాశముంది.