తెలంగాణా బీజేపీ నేతలు నానా అవస్థలు పడుతున్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అందరం ఒకటిగానే ఉన్నామని, ఏకతాటిపైన నడుస్తున్నామని చెప్పుకునేందుకు అవస్తలుపడుతున్నారు. ఎవరైనా విభేదాలుంటే చెప్పుకుంటారు వాటిని పరిష్కరించుకుంటారు. కానీ అందరం ఒకటిగానే ఉన్నామని ఎవరు చెప్పుకోరు. అలా చెప్పుకుంటున్నారంటేనే వాళ్ళమధ్య విభేదాలున్నాయని అందరికీ అర్ధమైపోతోంది. తామంతా ఒకటిగానే ఉన్నామని చెప్పుకునేందుకే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టడమే ఆశ్చర్యంగా ఉంది.
మీడియా సమావేశంలో బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి రాబోయేది బీజేపీనే అని గట్టిగా చెప్పారు. రామరాజ్యం తీసుకొస్తామని హామీఇచ్చారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తదితరులతో మీడియా సమావేశం నిర్వహించటంలోనే కిషన్ ఆంతర్యం అర్ధమైపోతోంది. పార్టీవర్గాల సమాచారం ప్రకారం ఈటలకు తొందరలోనే ఎన్నికల ప్రచారకమిటి ఛైర్మన్ పదవి రాబోతోందట.
మ్యానిఫెస్టో కమిటికి ఛైర్మన్ గా రాజగోపాలరెడ్డి, బీజేపీ ఎల్పీ నేతగా దుబ్బాక ఎంఎల్ఏ రఘునందనరావు అపాయింట్ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. ఇదే విషయమై ఢిల్లీ పెద్దలతో కిషన్ భేటీ కాబోతున్నారట. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే భేటీ తర్వాత వెంటనే ఉత్తర్వులు వచ్చే అవకాశముందని సమాచారం. కాబట్టి పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయే కంటిన్యు అవకాశాలున్నాయట. ఎందుకంటే బండిని తప్పించాల్సొస్తే అధ్యక్షుడిగా కిషన్ ను నియమించబోతున్నారట. అధ్యక్షపదవి అందుకోవటం కిషన్ కు ఏమాత్రం ఇష్టంలేదు.
తాను కేంద్రమంత్రిగానే ఉండాలంటే బండి అద్యక్షుడిగానే కంటిన్యుఅవ్వాలి. లేకపోతే బలవంతంగా కిషన్ కు అధ్యక్షబాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. పైగా బండిని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నాయని సమాచారం. సో, తాను సేఫ్ గా ఉండటం కోసమైనా కిషన్ అధ్యక్షుడు బండికి బలమైన మద్దతుదారుగా నిలబడాలి. మొత్తానికి ఈటల రాజేందర్, రాజగోపాలరెడ్డి, రఘునందనరావు లాంటి వాళ్ళంతా తీవ్ర అసంతృప్తిగానే ఉన్నారన్నది నిజమే అనుకోవాల్సొస్తోంది. ఎన్నికలకు ముందు కీలకనేతల్లోని అసంతృప్తి బయటపడటం అంటే పార్టీకి చేటుతేవటం ఖాయమనే ఆందోళన కూడా పెరిగిపోతోంది. మరి దీన్ని ఎలా టాకిల్ చేస్తారో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates