ఈ సర్వేతో వైసీపీకి మేలా చేటా?

ఎన్నికలు సమీపిస్తుంటే వివిధ సంస్థలు సర్వేలు చేసి ప్రజల నాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి. కానీ అందులో కొన్ని సర్వేలు మాత్రమే ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిచేలా ఉంటాయి. కొన్ని మాత్రం వాస్తవ దూరంగా అనిపిస్తాయి. కొన్ని సంస్థలు రాజకీయ పార్టీలతో ములాఖత్ అయి.. వారికి అనుకూలంగా సర్వే ఫలితాలు ప్రకటించి.. జనాలకు భ్రమలు కల్పించడానికి ప్రయత్నిస్తుంటాయి.

అలాగే ఆ పార్టీల కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి కూడా ఈ సర్వేలను ఉపయోగించుకుంటూ ఉంటారు. ఐతే సర్వేలు కొంతమేర ఎగ్జాజరేట్ చూపించి లాభం పొందాలని చూస్తే ఓకే కానీ.. మరీ ఏకపక్షంగా ఫలితాలు ఉంటేనే జనాలకు డౌట్లు కొడతాయి. ఇప్పుడు టైమ్స్ నౌ-నవభారత్ కలిసి చేసిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మరీ విడ్డూరంగా ఉండి ఇలాంటి సందేహాలే కలిగిస్తున్నాయి.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ 24కు 24 స్థానాలు గెలుచుకుంటుందని ఈ సర్వేలో తేలిందట. టీడీపీకి మహా అయితే ఒక సీట్ వస్తుందట. మిగతా పార్టీలన్నీ సున్నా చుట్టేయబోతున్నాయట. ఈ సర్వే చూపించి వైసీపీ వర్గాలు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నాయి. వైసీపీ మళ్లీ క్లీన్ స్వీప్ చేయబోతోందని ఆ పార్టీ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు.

కానీ వాస్తవ పరిస్థితి నిజంగా అలా ఉందా అన్నది సందేహం. ఏపీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ బెస్ట్ షాట్ 2019లోనే ముగిసిందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. మళ్లీ అలాంటి ఫలితాలు ఇంకెప్పటికీ రావని అభిప్రాయపడుతున్నారు. నాలుగేళ్లలో వైసీపీ వైఫల్యాలే ఎక్కువగా హైలైట్ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వైసీపీకి పట్టు ఉన్నప్పటికీ.. నగర, పట్టణ జనాలు మాత్రం ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

మధ్యతరగతి జనం అయితే జగన్ పేరు చెబితే మంటెత్తిపోతున్నారు. అందులోనూ ఈసారి టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ క్లీన్ స్వీప్ అన్నది అసంభవంగా కనిపిస్తోంది. వైసీపీకి 15-16 స్థానాలు అని సర్వేలో ప్రకటించి ఉంటే కొంచెం నమ్మశక్యంగా ఉండేదేమో. కానీ మరీ ఏకపక్షంగా ఫలితాలు ఉంటాయని ప్రకటించడంతో సామాన్య జనం ఈ సర్వేను నమ్ముతారా అని ప్రశ్న.
మరోవైపు ఇప్పటికీ గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకోకుండా వైసీపీ కార్యకర్తలు మద్దతుదారులు.. ఎటాకింగ్‌, అబ్యూజింగ్ మోడ్‌లోనే వెళ్తుండటం ఆ పార్టీ కొంప ముంచవచ్చనే అభిప్రాయాలు ఇప్పటికే ఉన్నాయి. ఇలాంటి సర్వేలు చూసి అదే భ్రమలో ఉండి, ఓవర్ కాన్ఫిడెన్స్‌కు వెళ్తే మరింత ప్రమాదం అనే చర్చ కూడా నడుస్తోంది. కాబట్టి ఇలాంటి సర్వేల వల్ల వైసీపీకి మంచి కంటే చెడే ఎక్కువేమో అన్నది కూడా ఆలోచించాలి.