అమరావతిపై ఫుల్ క్లారిటీతో పవన్ !

ఇంతకాలానికి రాజధాని అమరావతిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చారు. ఇంతకాలం అమరావతి విషయంలో పవన్ ముసుగులో గుద్దులాటలాగే వ్యవహారం నడిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడురాజధానులపైన పవన్ కామెంట్లు చేస్తున్నారే కానీ అమరావతి పైన మాత్రం తన స్టాండ్ ఏమిటనేది స్పష్టంగా ప్రకటించలేదు. అలాంటిది మొదటిసారి ప్రకటించారు. వారాహి యాత్రను తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో ప్రారంభించారు. ఇక్కడ జరిగిన బహిరంగసభలో పవన్ దాదాపు రెండు గంటలు మాట్లాడారు.

సభలో పవన్ మాట్లాడుతు జనసేన అధికారంలోకి వస్తే అమరావతే రాజధానిగా ఉంటుందని గట్టిగా చెప్పారు. మూడురాజధానుల పేరుతో జగన్ మూడుముక్కలాట ఆడుతున్నట్లు మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా డెవలప్ చేయటంలో చిన్నదిగా మొదలుపెట్టి పెద్దస్ధాయికి తీసుకెళ్ళమని తాను చేసిన సూచనను పవన్ గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అమరావతికి మద్దతిచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నాలుకమడతేయటంపై మండిపోయారు.

ప్రతిపక్షంలో ఉన్నపుడే జగన్ అమరావతిని వ్యతిరేకించుండాల్సిందన్నారు. అప్పుడు ఒకమాట ఇపుడు ఒకమాట మాట్లాడి జగన్ జనాలను మోసం చేసినట్లు చెప్పారు. జనసేన అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణానికి అవసరమైన యాక్షన్ తీసుకుంటుందని చెప్పారు. అందుకు జనసేనకు కావాల్సినంత బలాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలదే అన్నారు. వచ్చేఎన్నికల్లో జనసేన తరపున ఎంఎల్ఏలను గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. జనసేన గనుక అధికారంలోకి వస్తే ప్రజల ఆకాంక్షల ప్రకారమే పరిపాలన చేస్తుందని హామీ ఇచ్చారు.

అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రకటించిన పవన్ దాని నిర్మాణంగురించి మాత్రం ఏమీ మాట్లాడలేదు. రాజధాని నిర్మాణానికి అవసరమైన లక్షల కోట్లరూపాయలు ఎక్కడి నుండి తెస్తారు అన్న విషయంపై క్లారిటి ఇవ్వలేదు. రాజధాని నిర్మాణానికి రు. 5 లక్షల కోట్లవుతుందని అప్పట్లో చంద్రబాబు ప్రకటిచిన విషయం తెలిసిందే. మొదటి విడతలో రు. 1.10 లక్షల కోట్లు విడుదలచేయాలని చంద్రబాబు కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపారు. అయితే ఆ అంచనాలు మరో ఏడాది తర్వాత మరింతగా పెరిగిపోతాయి. కాబట్టి రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల విషయంలో కూడా పవన్ వివరణిస్తే జనాలకు మరింత క్లారిటి ఇచ్చినట్లవుతుంది.