చంద్రబాబుపై భగ్గుమంటున్న న్యూట్రల్స్

2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి విజయం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈసారి తేడా వస్తే ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. ఒక టెర్మ్‌లోనే తెలుగుదేశం పార్టీని జగన్ ఎంతగా వేధించాడో.. ఎన్ని ఇబ్బందులకు గురి చేశాడో తెలిసిందే. ఇంకో పర్యాయం ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిందంటే చంద్రబాబుతో పాటు టీడీపీ ఉనికి ప్రమాదంలో పడటం ఖాయం.

అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందే అని చంద్రబాబు పంతం పట్టారు. అందుకోసం ఆయన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. నిజానికి జగన్ సర్కారు మీద వ్యతిరేకత తీవ్రంగానే ఉంది. తెలుగుదేశానికి విజయావకాశాలు క్రమంగా పెరుగుతున్నాయి. జనసేనతో పొత్తు పెట్టుకుంటే విజయం నల్లేరుపై నడకే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ కేవలం పొత్తును నమ్ముకుంటే సరిపోదని చంద్రబాబు భావిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ క్రమంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు ఆయన్ని అభిమానించే తటస్థుల్లో వ్యతిరేకత పెంచుతోంది. సంక్షేమ పథకాల విషయంలో జగన్ సర్కారును ఇంత కాలం తిట్టిపోస్తూ.. ఇటీవలే మేనిఫెస్టోలో అనేక ఉచిత పథకాలను ప్రకటించడం న్యూట్రల్స్‌కు నచ్చలేదు. జనాలను సోమరిపోతులను చేస్తున్నారని, రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని జగన్ ప్రభుత్వాన్ని విమర్శించి.. మీరు చేస్తున్నదేంటి అంటూ చంద్రబాబును విమర్శించింది ఓ వర్గం.

ప్రగతి శీల నాయకుడిగా, అభివృద్ధికి రోల్ మోడల్‌లా కనిపించే చంద్రబాబు నుంచి ఇలాంటివి ఊహించలేదని అంటున్నారు. ఈ వ్యతిరేకత సరిపోదని.. బీజేపీతో పొత్తు దిశగా చంద్రబాబు అడుగులు వేస్తుండటాన్ని కూడా ఈ వర్గం వ్యతిరేకిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకుని ఆయన్ని కలిసిన చంద్రబాబుపై న్యూట్రల్స్ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.

బీజేపీతో పొత్తు వల్ల కలిగే ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ అని.. ఇప్పటికే విజయంపై ధీమా ఉన్నపుడు బీజేపీ మోరల్ సపోర్ట్ కోసం వెంపర్లాడాల్సిన పని లేదని.. దీని వల్ల చాలామంది నుంచి వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి ఉంటుందని.. చివరగా ఇది బూమరాంగ్ అవుతుందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ మద్దతుదారుల్లో కూడా ఈ విషయంలో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది.