గంటా శ్రీనివాసరావు… తెలుగు నేల రాజకీయాల్లో పరిచయం ఎంతమాత్రం అక్కర్లేని పేరే. అధికారంలో ఏ పార్టీ ఉంటే… ఆ పార్టీలోకి ఇట్టే జంప్ చేసే సత్తా కలిగిన నేతల్లో గంటా అగ్రగణ్యుడనే చెప్పాలి. ప్రస్తుతం టీడీపీలో ఉన్న గంటా… అధికార పార్టీగా ఉన్న వైసీపీలోకి జంప్ కొట్టేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు.
వైసీపీలో ఓ వర్గం ఆయన రాకను అడ్డుకుంటున్నా కూడా గంటా తనదైన మార్కు వ్యూహంతో వైసీపీ అధిష్ఠానం నుంచి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ తెచ్చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తనతో పాటు తన అనుచరవర్గంతో పాటుగా టీడీపీలోని పలువురు కీలక నేతలను కూడా ఆయన తన వెంట వైసీపీలోకి తీసుకెళ్లేందుకు గంటా రంగం సిద్ధం చేసుకున్నారని, ఈ పరిణామం టీడీపీకి పెద్ద షాకివ్వబోతున్నదన్న వార్తలు కూడా ఆసక్తి రేపుతున్నాయి.
తొలుత వ్యాపారవేత్తగా సక్సెస్ సాధించిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన గంటా… ఆది నుంచి అవకాశవాద రాజకీయాలకే ప్రాధాన్యమిచ్చినట్టుగా చెప్పుకోవాలి. పార్టీ ఏదన్న విషయానికి ప్రాధాన్యం ఇవ్వకుండా అధికారంలో ఉన్న పార్టీలోనే కొనసాగేలా… తద్వారా తన పనులన్నీ సజావుగా సాగేలా చూసుకుంటారని గంటాకు ఓ ప్రత్యేకమైన పేరు ఉంది. ఆ పేరు సార్థకం చేసుకునే క్రమంలోనే గంటా ఇప్పుడు అధికార పార్టీగా మారిన వైసీపీలోకి జంప్ కొట్టేస్తున్నారట.
ఇక టీడీపీ నుంచి తానొక్కడే కాకుండా టీడీపీ టికెట్లపై మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలను కూడా గంటా తన వెంట వైసీపీలోకి తీసుకువెళుతున్నారట. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది.
అయినా గంటా వెంట టీడీపీ వీడి వైసీపీలోకి జంప్ కొట్టబోతున్న వారెవరన్న విషయంపై ఆరా తీస్తే… విశాఖ నగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గణబాబుతో పాటు మరో ఎమ్మెల్యే కూడా ఉన్నారట. అదే సమయంలో విశాఖకే చెందిన టీడీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు కూడా గంటాతో పాటు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందట.
ఇక వీరు కాకుండా విశాఖ నగరంలో టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు కూడా గంటాతో కలిసి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారట. దీనికి సంబంధించి తన వెంట ఎవరెవరు వైసీపీలోకి వస్తారన్న వివరాలను ఓ జాబితా రూపంలో గంటా ఆ పార్టీ అధిష్ఠానానికి ఇప్పటికే అందజేశారట. మరి ఆ జాబితాకు వైసీపీ అధిష్ఠానం ఏమంటుందో?… గంటా ఎప్పుడు వైసీపీలోకి చేరతారో చూడాలి.