హరహరా ఎందుకు ఇన్ని కష్టాలు  

అసలు నిర్మాత ఏఎం రత్నంకు ముహూర్త బలం బాలేనట్టు ఉంది. పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు ఏ క్షణంలో తలపెట్టారో కానీ అప్పటి నుంచి విఘ్నాలు తలెత్తునే ఉన్నాయి. కరోనా టైంలో  వర్షానికి సెట్లు కూలిపోయాయి. షూటింగ్ చాలా సార్లు వాయిదా పడుతూ ఆగుతూ సాగుతూ జరుగుతోంది. కొందరు ఆర్టిస్టులు మారిపోయారు. దీనికన్నా చాలా ఆలస్యంగా మొదలైన బ్రో, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ లు శరవేగంగా చిత్రీకరణలు జరుపుకుంటూ అప్డేట్లు ఇస్తున్నాయి. బిజినెస్ క్రేజ్ కూడా వాటికి ఉన్నంత ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీకి లేదన్నది వాస్తవం.

ఒకవేళ హరిహరవీరమల్లు ఒకటే ప్రొడక్షన్ లో ఉంటే కథ వేరుగా ఉండేది. కానీ పవన్ లైనప్ పెరగడంతో ఇది కాస్తా సైడ్ లైన్ అయిపోయింది. గౌతమిపుత్రశాతకర్ణి లాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని వేగంగా తీసిన దర్శకుడు క్రిష్ వీరమల్లు విషయంలో మాత్రం విపరీతమైన జాప్యానికి తల వంచక తప్పలేదు. దీని కోసమే నెక్స్ట్ ఎవరితో చేయాలనే నిర్ధారణకు రాలేదు. మధ్యలో సమయం దొరికింది కదాని తొందరపడి వైష్ణవ్ తేజ్ తో కొండపొలం చేస్తే అదేమో కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చింది. దెబ్బకు సైలెంట్ అయిపోయి పూర్తిగా పవన్ పని మీదే ఉన్నాడు

ఎప్పుడు పూర్తవుతుందో ఎప్పుడు రిలీజ్ ప్లాన్ చేశారో అంతు చిక్కడం లేదు. డిసెంబర్ క్రిస్మస్ ఆల్రెడీ వెంకటేష్, నానిలతో ప్యాక్ అయ్యింది. జనవరి సంక్రాంతికి ప్రభాస్, కమల్ హాసన్, మహేష్ బాబులు కాచుకుని ఉన్నారు. వేసవిలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఢీ కొట్టడం ఖాయమైనట్టే. ఇంత టైట్ షెడ్యూల్స్ పెట్టుకుని కనీసం విడుదల తేదీని లాక్ చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. పైగా ఆల్ ఇండియా రిలీజ్ కాబట్టి బాలీవుడ్ డేట్లను సరిచూసుకుని మరీ ప్లాన్ చేయాలి. అయినా ఇన్నేసి అవాంతరాలు పవన్ ఏ సినిమాకు జరగలేదన్నది వాస్తవం