టీడీపీలో ఎన్టీఆర్ జోష్‌.. ఓట్లు రాల్చే మంత్రం ఇదేనా…?

తెలుగు దేశం పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని అధికారంలోకి వ‌చ్చి తీరాలి. ఇది చంద్ర‌బాబు నాయుడు చేసిన శ‌ప‌థ‌మే కాదు.. పార్టీ మ‌నుగ‌డకు కూడా అత్యంత కీల‌కంగా మారింది. గ‌త ఎన్నిక‌ల‌లో ఓట‌మి త‌ర్వాత‌.. పార్టీ ఎదుర్కొన్నఅనేక ఆటుపోట్లు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. నిజానికి పైకి చంద్ర బాబు కానీ.. ఆయ‌న పార్టీ నాయ‌కులు కానీ.. గంబీరంగా ఉన్న‌ప్ప‌టికీ.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో మాత్రం దీనిని అంగీక‌రిస్తున్నారు.

ఈ లోటుపాట్లు స‌రిదిద్దే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నా.. నాయ‌కులు గాడిలో ప‌డ‌డం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు క‌ర్నూలులోని భూమా అఖిల ప్రియ‌, ఏవీ సుబ్బారెడ్డి వ‌ర్గాల మ‌ధ్య పోరు రోడ్డున ప‌డింది. అదేవిధంగా విజ‌య‌వాడ‌లోనూ.. ఎంపీ.. నాని, ఇత‌ర నేత‌ల మ‌ధ్య కోల్డ్ వార్ కొన‌సాగుతోంది. ఇక‌, గుంటూరులోనూ ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పైకి అంతా బాగానే ఉంద‌ని చెబుతున్న‌ప్ప‌టికీ.. పార్టీ అధినేత సైతం ఒప్పుకొంటున్న వాస్త‌వాలు ఇవి.

దీంతో వీరిని గాడిలో పెట్టి.. పార్టీని పుంజుకునేలా చేయ‌డానికి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం దిశ‌గా పార్టీని న‌డిపించేందుకు ఉన్న అస్త్ర శ‌స్త్రాలపై చంద్ర‌బాబు దృష్టి పెట్టారు. వీటిలో కీల‌క‌మైంది.. అన్న‌గారి శ‌త‌జ‌యంతిగా భావిస్తున్నారు. అన్న‌గారి శ‌త జ‌యంతి కార్య‌క్ర‌మాల‌ను ఊరూవాడా.. నిర్వ‌హించాల‌ని.. సోమ‌వారం నుంచి ఖ‌చ్చితంగా ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. వార్డులోనూ శ‌త జ‌యంతి వేడుక‌లు నిర్వ‌హించి.. వాటి తాలూకు వీడియోల‌ను పార్టీకి పంపాల‌ని ఆదేశాలు అందాయి.

దీంతో అయినా.. నేత‌లు స‌ఖ్య‌త‌తో ఉంటార‌ని.. అంద‌రూ క‌లిసి మెలిసి ప‌ని చేసుకుంటార‌ని.. చంద్ర‌బాబు భావిస్తున్నారు. అయితే.. మ‌రి ఈ ప్ర‌య‌త్నం ఏమ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలి. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అనేక చ‌ర్చ‌ల్లో నాయ‌కులు ఇలా చేతులు క‌లుపుకోవ‌డం.. అలా విడిపోయి.. రోడ్డెక్క‌డం కామ‌న్‌గా మారింది. తాడిప‌త్రి నుంచి టెక్క‌లి వ‌ర‌కు కూడా నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వ‌య లోపం స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న ద‌రిమిలా.. శ‌త‌జ‌యంతితో అయినా.. వారు క‌లుస్తార‌ని చంద్ర‌బాబు ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.