దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంపై తాజాగా సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. దీనిలో కొన్ని సంచలన విషయాలు వెల్లడించింది. ఏటా 500 కోట్లను రాబట్టుకునేలా.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్కెచ్ గీశారని ఆరోపించింది. కుంభకోణంలో ఆయన పాత్రపై అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయని సీబీఐ తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించే విషయాన్ని కోర్టు వాయిదా వేసింది.
తాజాగా సీబీఐ చేసిన రూ.500 కోట్ల ఆరోపణలతో అసలు.. మద్యం విధానం ఏంటి? ఒక్కరికే అంటే సిసోడి యాకే రూ.500 కోట్లు వస్తాయా? అనే చర్చ జోరుగా సాగుతోంది. 2021లో ప్రవేశపెట్టిన ఈ మధ్యం పాలసీ అనేక విధాల వివాదాల్లో చిక్కుకుంది. దీనిపై అప్పటి గవర్నర్ అనుమానం వ్యక్తం చేయడం.. తన కు ఉన్న అధికారాలతో కేంద్రానికి లేఖ రాయడంతో.. సీబీఐ, ఈడీ కూడా రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో మంత్రి మనీష్‌ను అరెస్టు చేశారు. సీఎం కేజ్రీవాల్‌ను కూడా ప్రశ్నించారు.
అసలేంటీ విధానం..
తాజా పరిణామాల నేపథ్యంలో అసలు ఢిల్లీ లిక్కర్ విధానం ఏంటి? ఎందుకు వివాదానికి కారణమైందనే విషయం మరోసారి చర్చకు వస్తోంది. దీనిని పరిశీలిస్తే.. ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.
+ ఈ విధానంలో మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు
+ కేవలం ప్రైవేటు దుకాణాల్లో మాత్రమే మద్యం అమ్మకాలు జరుగుతాయి
+ ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా.. ఇక్కడ మద్యం విక్రయించుకోవచ్చు.
+ నకిలీ మద్యం, బ్లాక్ వ్యాపారం వంటివాటిని నిలువరిస్తారు
+ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం ప్రధాన వ్యవహారం.
+ లిక్కర్ ను డోర్ డెలివరీ చేస్తారు.
+ దుకాణాలు తెల్లవారుజాము 3 గంటల వరకు తెరచి ఉంచవచ్చు
+ అపరిమితమైన డిస్కౌంట్లను ఆఫర్ చేయవచ్చు