జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజులుగా ఏపీలోనే ఉన్నారు. ఆయన.. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మేధావులను సైతం తికమకకు గురి చేశాయి. గురు, శుక్రవారాల్లో పవన్ చేసిన వ్యాఖ్యలతో అసలు.. పవన్ ఎటువైపు అడుగులు వేస్తున్నారనే చర్చ కూడా తెరమీదికి వచ్చింది. తొలిరోజు తమకు 40 సీట్లు వచ్చి ఉంటే.. ముఖ్యమంత్రి పీఠం కోసం పట్టుబట్టేవాడినని చెప్పారు.
రెండో రోజు శుక్రవారం మాట్లాడుతూ.. కనీసం మనం 10 సీట్లనైనా గెలుచుకునే ప్రయత్నం చేయలేమా? అని చెప్పుకొచ్చారు. దీంతో జనసేన నాయకుల్లోనే తర్జన భర్జన ఏర్పడింది. ఇదిలావుంటే.. పార్టీకి జిందాబాద్‌లు కావు.. ఓట్లు కావాలి.. అని పవన్ ప్రకటన చేశారు. ఇది కావాలంటే.. ఎవరు ముందుండి నడిపించాలనేది నేతల్లో వస్తున్న సందేహం. పవనే జోక్యం చేసుకుని.. పార్టీని ముందుకు నడిపించాలి.
కానీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని గమనిస్తే.. పట్టుమని 50 నియోజకవర్గాల్లో అయినా.. బలమైన అభ్యర్థులు ఉన్నారా? అంటే లేదు. దీనికి పవన్ స్వయం కృతం కాదా? పార్టీని క్షేత్రస్థాయిలో వేళ్లూను కునేలా చేయడంలో ఆయన విఫలం కావడం లేదా? అనేది సైనికుల ప్రశ్న. ఇదిలావుంటే, వచ్చే ఎన్నిక ల్లో మెజారిటీని బట్టి.. సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామన్నారు.
అయితే.. ఇది నిజం కావాలంటే.. ఏపార్టీకి ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలి. అప్పుడు 175 స్థానాల్లో టీడీపీకి వచ్చిన స్థానాలు, జనసేనకు వచ్చిన సీట్లు, అదేవిధంగా బీజేపీకి వచ్చిన స్థానాలను బట్టి..ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తే.. అప్పుడు సీఎం సీటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ, పవన్ ఎన్నికలకు ముందుగానే పొత్తులు అంటున్నారు. అంటే.. ఉన్న 175 సీట్లను మూడు పార్టీలు పంచుకుంటాయి.
దీనిని బట్టి ముందుగానే మెజారిటీ తెలిసిపోతుంది కదా! అంటే.. ఎన్నికలకు ముందే.. టీడీపీ 110 స్థానాలు.. జనసేన 50 స్థానాలు.. బీజేపీ 15 స్థానాల్లో పోటీచేస్తే.. అప్పుడు సీఎం అభ్యర్థి ఎవరు అనేది స్పష్టంగా తెలుస్తోంది. కానీ, పవన్ మాత్రం ఎన్నికల తర్వాత అంటున్నారు. దీనిని బట్టి అసలు ఆయన వ్యూహం ఏంటి? ఏంచేయాలని అనుకుంటున్నారు? అనేది తర్జన భర్జనగా ఉండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates