వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ విజయం దక్కించుకుని గెలుపు గుర్రం ఎక్కాలని భావిస్తున్న టీడీపీకి హ్యాట్రిక్ పరాజయాలు అంతర్మథనంలో ముంచేస్తున్నాయి. ఇప్పటి వరకు వైనాట్ పులివెందుల అని నినదించిన పార్టీలో దాదాపు 50 నియోజకవర్గాల్లో వరుస పరాజయాలు వెక్కిరిస్తున్నాయి. వీటిలో కీలకమై న చిత్తూరు జిల్లా కూడా ఉండడం.. ఇది పార్టీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కావడం గమనార్హం. దీంతో ఇప్పుడు ఆయా నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని యోచిస్తున్నారు.
గత మూడు ఎన్నికల్లోనూ టీడీపీ పరాజయం పాలవుతున్న నియోజకవర్గాల్లో ఇప్పుడు కూడా పరిస్థితి అలానే ఉంది. వీటిలో రాజాం, పాలకొండ, పాతపట్నం, కురుపాం, సాలూరు, బొబ్బిలి, పాడేరు, రంపచోడవరం, తుని, జగ్గంపేట, పిఠాపురం, కొత్తపేట, తాడేపల్లిగూడెం, తిరువూరు, పామర్రు, విజయవాడ వెస్ట్, మంగళగిరి, బాపట్ల, గుంటూరు ఈస్ట్, నరసరావుపేట, మాచర్ల వంటి కీలక నియోజకవర్గాలు ఉన్నాయి.
అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు, కందుకూరు, గిద్దలూరు, నెల్లూరులోని ఆత్మకూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, కడపలోని బద్వేలు, రైల్వేకోడూరు, కడప, రాయచోటి, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు, కర్నూలులోని నందికొట్కూరు, కోడుమూరు, ఆళ్లగడ్డ, శ్రీశైలం, కర్నూలు, పాణ్యం, ఆలూరు, చిత్తూరులోని జి.డి.నెల్లూరు, పూతలపట్టు, చంద్రగిరి, పీలేరు, మదనపల్లి, పుంగనూరు నియోజకవర్గాలు టీడీపీకి సెగ పెడుతున్నాయి.
2009లో ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం దక్కించుకుంది. తర్వాత.. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది. దీంతో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కనీసం అచ్చెన్నాయుడు చెబుతున్నట్టు 160 స్థానాల్లో అయినా.. విజయం దక్కించుకోవాలంటే.. ఈ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. కానీ, ఇప్పటి వరకు వీటిలో చాలా నియోజకవర్గాలపై టీడీపీ దృష్టి పెట్టలేదు. మరి ఏం చేస్తారో చూడాలి.