అధికార వైసీపీలో అంతర్గత వివాదాలను చక్కదిద్దే బాధ్యతలను జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిపైన ఉంచారు. ఇందులో భాగంగానే నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమించారు. తాజా నియామకంతో విజయసాయికి పార్టీతో పాటు ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకునే అవకాశం దక్కింది. ఇంతకుముందు ఈ హోదాలో పనిచేసిన మాజీమంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి రాజీనామా చేయటంతో విజయసాయిని జగన్ నియమించారు.
ఒకపుడు ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా ఎంపీ పనిచేసిన విషయం తెలిసిందే. సహజంగానే దూకుడు స్వభావం ఉన్న ఎంపీ పార్టీ, ప్రభుత్వంలో బాగా చొచ్చుకుపోయారు. దాంతో కొన్ని ఇబ్బందులు ఎదరవుతున్నట్లు కొందరు నేతలు ఫిర్యాదులుచేశారు. దాంతో జగన్ ఎంపీని పక్కన పెట్టి ఆ బాధ్యలను టీటీడీ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. అయితే అనుకున్నంత ఎఫెక్టివ్ గా వైవీ పనిచేయటంలేదనే అసంతృప్తి పార్టీలో కనబడుతోంది.
ఇదే సమయంలో బాలినేని రాజీనామాతో మళ్ళీ విజయసాయి ఎంట్రీకి అవకాశం వచ్చింది. ప్రస్తుత పరిస్ధితి ఏమిటంటే నెల్లూరులో నేతల మధ్య విభేదాలు పెరిగిపోతున్నాయి. అలాగే ప్రకాశంజిల్లాలో విభేదాలు చాపకింద నీరులాగుంది. చిత్తూరు జిల్లాల్లో పార్టీపరంగా పెద్ద సమస్యలు ఏమీలేవు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వివాదాల పరిష్కారంపైనే ఎక్కువ దృష్టి పెట్టమని ఎంపీకి జగన్ స్పష్టంగా చెప్పారట. రాజకీయాల్లో అప్ అండ్ డైన్ ఎవరికైనా సహజమే.
విజయసాయి వ్యవహారం కూడా ఇందులో భాగమే. ఒకపుడు జగన్ తర్వాత పార్టీ, ప్రభుత్వంలో చక్రంతిప్పిన ఎంపీ తర్వాత తెరమరుగైపోయారు. ఒకపుడు ఢిల్లీలో అన్నీ తానే అయి వ్యవహారాలు నడిపిన ఎంపీ అక్కడ కూడా యాక్టివ్ గా లేరు. అలాంటిది ఎన్నికలు మరో ఏడాది ఉందనగా కీలక బాధ్యతల్లో నియమితులయ్యారు. దాంతో విజయసాయి మద్దతుదారులు ఫుల్లు హ్యాపీ అవుతున్నారు. కాకపోతే ఇచ్చిన బాధ్యతలు చాలా కష్టమైనవని గుర్తుపెట్టుకోవాలి. నెల్లూరు నేతల మధ్య వివాదాలు పరిష్కరించటం అంత వీజీ కాదు. సస్పెండ్ అయిన ముగ్గురు ఎంఎల్ఏలను పార్టీలో నుండి పంపేస్తే చాలా సమస్యలు సెటిల్ అవుతాయని పార్టీలో టాక్ నడుస్తోంది. మరి విజయసాయి ఏమిచేస్తారో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates