రాబోయే ఎన్నికల్లో చిలకలూరిపేట ఎంఎల్ఏ, వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని గెలుపు కష్టంగానే ఉంటుందని ప్రచారం పెరిగిపోతోంది. మంత్రికి పార్టీలోనే కొన్ని సమస్యలున్నాయి. అలాగే బయట సమస్యలు కూడా మరికొన్ని తోడయ్యాయట. దాంతో పోయినసారి గెలిచినంత ఈజీకాదు రజనీ వచ్చే ఎన్నికల్లో గెలవటం అనే ప్రచారం ఎక్కువైపోతోంది. నిజానికి పోయిన ఎన్నికల్లో రజనీ గెలుపులో ఎక్కువభాగం జగన్మోహన్ రెడ్డి గాలి బాగా పనిచేసింది. ఎందుకంటే చిలకలూరిపేట నియోజకవర్గం అంటేనే మొదటి నుంచి కమ్మ సామాజిక వర్గానికి బాగా పట్టున్న నియోజకవర్గమని పేరు.
అలాంటిది బీసీ వర్గానికి చెందిన రజనీ గెలవటమే సంచలనం. అందునా మొదటిసారి పోటీ చేసిన రజనీ బాగా సీనియర్ అయిన టీడీపీ అభ్యర్ధి, అప్పట్లో మంత్రి పత్తిపాటి పుల్లారావును ఓడించటం చాలా పెద్ద విషయం. మొదటిసారి గెలవటమే పెద్ద విషయం అనుకుంటే గెలిచిన రెండేళ్ళల్లోనే మంత్రి అయిపోవటం అదృష్టమనే చెప్పాలి. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో మంత్రికి ఏ మాత్రం పడటంలేదు. అలాగే మరో సీనియర్ నేత, ఎంఎల్సీ మర్రి రాజశేఖర్ తో పాటు మంత్రికి పొసగటం లేదు.
ఇక వీటితో పాటు చిన్న చిన్న సమస్యలు ఎలాగూ ఉంటాయి. అన్నీ కలిపి మంత్రిపై వ్యతిరేకత పెంచేస్తున్నాయన్నది నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం. మంత్రి దూకుడు స్వభావం కూడా సమస్యగా మారుతోందని పార్టీలోనే చర్చ జరుగుతోంది.
అయితే మంత్రి మాత్రం తన పని తాను చేసుకపోతున్నారు. సంక్షేమ పథకాల అమలు, కొన్ని అభివృద్ధి పనులు, జగనన్న కాలనీలే తనను గెలిపిస్తాయని రజనీ ఆశలు పెట్టుకున్నారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అసలు రజనీకి టికెట్ దక్కుతుందా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఎంపీయే వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట ఎంఎల్ఏగా పోటీచేయాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారట. నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం ఓట్లు సుమారు 40 వేలుంటాయి. ఎస్సీలు 65 వేలు, వైశ్యుల ఓట్లు 25 వేలు, ముస్లిం ఓట్లు 30 వేలు, రెడ్లు 10 వేల దాకా ఉంటారు. మిగిలిన సామాజికవర్గాల ఓట్లు మరో 70 వేలదాకా ఉంటాయి. రజనీకి టికెట్ దక్కుతుందా, గెలుస్తారా అన్నది ఆసక్తిగా మారుతోంది.