ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల నుంచి వైసీపీ నాయకుల నోటి దురుసును అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష నేతలనే కాదు.. సామాన్య ప్రజల్లో కూడా ఎవరైనా తమకు ఎదురు మాట్లాడితే బూతులు తిట్టేయడం, కొట్టడానికి కూడా వెనుకాడకపోవడం పలు సందర్భాల్లో చూశాం.
తాజాగా పౌర సరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఒక రైతును దుర్భాషలాడిన తీరు వివాదాస్పదమైంది. అకాల వర్షం వల్ల ధాన్యం తడిసిపోయిందంటూ సదరు రైతు గోడు వెళ్లబోసుకుంటే.. ఆయన బూతులు అందుకున్నారు.
ధాన్యం తడిసిపోతే నేనేం చేస్తా అంటూ ఆ రైతును ఎర్రిపప్పా అన్నారు. ఈ వ్యాఖ్యలపై తర్వాత మీడియా వాళ్లు వివరణ అడిగితే.. అతను రైతు కాదు, తాగుబోతు.. నేనేమీ తప్పు మాట్లాడలేదు అని కవర్ చేసుకున్నారు. ఐతే రైతును ఎర్రిపప్పా అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి.. నాగేశ్వరరావు తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఇది రైతులకు ప్రభుత్వం మీద చెడు సంకేతాలను ఇస్తుందన్న ఉద్దేశంతో ఆయన మరుసటి రోజు తన వ్యాఖ్యలపై మరోసారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఈసారి దూకుడు తగ్గించుకుని వినమ్రంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఎర్రిపప్పా అనే పదానికి ఆయన కొత్త అర్థం చెప్పి మరోసారి సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యారు. ఎర్రిపప్పా అంటే తిట్టేం కాదని.. బుజ్జి నాన్నా అన్న అర్థంతో వాడతామని ఆయనన్నారు. కానీ కవరింగ్‌లో ఆయన మరింతగా సోషల్ మీడియాకు దొరికిపోయారు. నాగేశ్వరరావుతో సహా వైసీపీ నేతలందరూ ఎర్రిపప్పలు, అంటే బుజ్జి కన్నాలే అంటూ కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్లు. హుందాగా తప్పయిందని ఒప్పేసుకుని, క్షమాపణ చెప్పాల్సింది పోయి కవరింగ్‌తో ఇంకా ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు మంత్రిగారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates