విజయసాయి యాక్టివ్ అవబోతున్నారా ?

ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారా ? పార్టీ వర్గాలు అవుననే చెబుతున్నాయి. ఒకపుడు ప్రభుత్వ సలహాదారు గా సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ వ్యవహారాల్లో విజయసాయిరెడ్డి బాగా యాక్టివ్ గా ఉండేవారు. అయితే వివిధ కారణాల వల్ల విజయసాయిని పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి, సజ్జలకే రెండు బాధ్యతలను అప్పగించారు. అయితే రెండు బాధ్యతలను నిర్వర్తించటంలో సజ్జల పెద్దగా సక్సెస్ కాలేదు.

ఇదే సమయంలో పార్టీలోని సీనియర్లు కొందరు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నా వారిని బుజ్జగించడం లో సజ్జల ఫెయిలయ్యారని జగన్ భావించారట. ఈ మధ్యనే ఒంగోలు ఎంఎల్ఏ బాలినేని శ్రీనివాసులరెడ్డి వ్యవహారంపై  పార్టీలో బాగా చర్చజరిగింది. బాలినేని వ్యవహారం పార్టీపై కాస్త నెగిటివ్ గా పడింది. ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి వ్యవహారాలు మరిన్ని బయటపడే సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

కాబట్టి సజ్జలను డబుల్ యాక్షన్ నుండి తప్పించి మళ్ళీ విజయసాయికి కీలక బాధ్యతలు అప్పగించాలని జగన్ డిసైడ్ అయినట్లు పార్టీవర్గాల సమాచారం.  విజయసాయి ఒకపుడు ఉత్తరాంధ్ర బాధ్యతలతో పాటు పార్టీలోని అనుబంధ సంఘాలను సమన్వయం చేసుకునే బాధ్యతలను కూడా చూసుకునే వారు. అలాగే నేతల మధ్య విభేదాలను కూడా పరిష్కరించేవారు. ముందు ఉత్తరాంధ్ర బాధ్యతల నుండి తప్పించి తర్వాత అనుబంధ సంఘాల సమన్వయం నుండి కూడా తప్పించారు. ప్రస్తుతం ఈ ఎంపీ ఢిల్లీలోని పార్టీ వ్యవహారాలకు మాత్రమే పరిమితమయ్యారు. దాంతో ఎంపీని జగన్ పూర్తిగా పక్కనపెట్టేశారనే ప్రచారం అందరికీ తెలిసిందే.

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ విజయసాయికి కీలక బాధ్యతలు అప్పగించాలని జగన్ అనుకున్నారట. మరి ఆ కీలక బాధ్యతలు ఏమిటో, ఎలాగుంటాయో వెయిట్ చేస్తే కానీ తెలీదు. నేతల మధ్య సమన్వయం, అసంతృప్తులను బుజ్జగించటం లాంటి బాధ్యతలు ఉంటాయని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా కొంతకాలంగా స్తబ్దుగా ఉండిపోయిన విజయసాయి మళ్ళీ యాక్టివ్ అయ్యే సూచనలు అయితే కనబడుతున్నాయి. పార్టీలోని సీనియర్లను సమర్ధవంతంగా వాడుకోవటం ఏ పార్టీకైనా అవసరమే కదా. చూద్దాం చివరకు ఏమవుతుందో.