ప్ర‌కాశంలో వైసీపీ తుఫాను ఆగిన‌ట్టేనా?

Balineni

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో చెల‌రేగిన వైసీపీ తుఫాను స‌ర్దుకున్న‌ట్టేనా? కీల‌క నేత‌, సీఎం జ‌గ‌న్‌కు దూర‌పు బంధువు కూడా బాలినేనిశ్రీనివాస‌రెడ్డి లైన్‌లోకి వ‌చ్చిన‌ట్టేనా? అంటే.. ప్ర‌స్తుత ప‌రిణామాల‌ను గ‌మ‌ని స్తున్నవారు… న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైవీ కంటే కూడా బాలినేని అవ‌స‌రం ఎక్కువ‌గా ఉంద‌ని అంద‌రికీ తెలిసిందే. వైవీకి ప‌గ్గాలు అప్ప‌గించిన ప్రాంతాల్లో పార్టీ ఇబ్బందుల్లో ప‌డు తోంద‌ని మెజారిటీ నాయ‌కులు చెబుతున్నారు.

అయితే.. ఇటీవల త‌లెత్తిన వివాదంలోపాతిక వంతు స‌మ‌స్య మాత్ర‌మే తీరింద‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. డీఎస్పీ బ‌దిలీ విష‌యంలో మాత్ర‌మే బాలినేని ఒకింత పైచేయిసాధించార‌ని.. కానీ, జిల్లా వ్యాప్తంగా జ‌ర‌గాల్సింది చాలానే ఉంద‌ని బాలినేనివ‌ర్గం చెబుతోంది. అనేక మంది నాయ‌కులు ఇప్పుడు వైవీ అండ‌ర్‌లోకి వెళ్లిపోయార‌ని.. ఒక‌ప్పుడు వారంతా కూడా బాలినేని వ‌ర్గంగా ఉన్నార‌ని అంటున్నారు. కానీ, ఇప్పుడు వైవీ ప‌గ్గాలు చేప‌ట్టాక‌.. వారిని త‌న‌వైపు తిప్పుకొన్నార‌ని చెబుతున్నారు.

అస‌లు వివాదానికి ప్ర‌ధాన కార‌ణం.. ఇదేన‌ని అంటున్నారు. అయితే దీనిని పైకి చెప్పుకోలేక‌.. లోలోన దాచుకోలేక బాలినేని తీవ్ర సంక‌టంలో చిక్కుకున్నార‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎలా చూసుకు న్నా ఈ ప‌రిణామాలు.. తీవ్రంగానే బాలినేని కూట‌మిని క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. అందుకే.. అగ్ర‌నేత త‌న‌ను టార్గెట్ చేస్తున్నారంటూ.. బాలినేని వ్యాఖ్యానించారు. కానీ, పేరు మాత్రం చెప్ప‌లేదు.

ఈ విష‌యం తేల‌కుండా.. కేవ‌లం డీఎస్పీని అయిన వారిని లేదా.. కోరుకున్న‌వారిని నియ‌మించినంత మాత్రం ఇక్క‌డ ప‌రిస్థితులు స‌ర్దుమ‌ణిగిన‌ట్టు కాద‌ని ఎక్కువ మంది అభిప్రాయ ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఉమ్మ‌డి ప్ర‌కాశంలో టీడీపీ జోరు ఎక్కువ‌గా ఉంది. కీల‌క‌మైన గొట్టిపాటి ర‌వి, ఏలూరి సాంబ‌శివ‌రావు వంటివారు.. టీడీపీని విస్త‌రిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో బాలినేని దూకుడు పెర‌గాల్సి ఉంటుంద‌ని.. కానీ, ఈ దిశ‌గా ఇప్పుడు వెనుకంజ‌లో ఉన్నార‌ని ఆయ‌న వ‌ర్గం భావిస్తోంది. అంటే.. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. ఉమ్మ‌డి ప్ర‌కాశంలో ప‌రిస్థితి నివురు గ‌ప్పిన నిప్పులాగానే ఉంద‌ని చెబుతున్నారు.