విజయసాయిరెడ్డికి ఇది ఎన్నో పదవో తెలుసా?

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురించి పరిచయం అక్కర లేదు. వైసీపీలో కీలక నేతగా కొనసాగుతోన్న విజయసాయిరెడ్డి….జాతీయ స్థాయిలో వైసీపీ గళం వినిపిస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా జగన్ కు వెన్నుదన్నుగా ఉన్న విజయసాయి….వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో అత్యంత కీలక నేతగా మారారు. వైసీపీలో జగన్ తరువాత అత్యంత కీలక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయసాయిరెడ్డికి ఎన్నో కీలక పదవులు దక్కాయి. వైసీపీ తరఫున 2016లో రాజ్యసభలో ఎంపీగా అడుగుపెట్టిన విజయసాయి వైసీపీ తరపున పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. రాజ్యసభలోనూ వైసీపీపక్ష నేతగా ఉన్న విజయసాయిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా గతంలోనే ఏపీ ప్రభుత్వం నియమించింది. ఏపీలో కేబినెట్ మంత్రి హోదా ఉన్న విజయసాయి వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తూ సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయసాయిరెడ్డిని మరో పదవి వరించింది.

రాజ్యసభ కార్యక్రమాల నిర్వహణలో కీలక పాత్ర పోషించే బిజినెస్ అడ్వైజరీ కమిటీలో విజయసాయికి చోటు దక్కింది. తాజాగా జరిగిన రాజ్య‌స‌భ ఎన్నికల్లో వైసీపీ నుంచి కొత్తగా నలుగురు సభ్యులు ఎన్నికయ్యారు. దీంతో.. రాజ్య‌స‌భ‌లో వైసీపీ బ‌లం రెండు నుంచి ఆరుకు పెరిగింది. విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు వైసీపీ నుంచి రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఉన్నారు. రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించడంతో బీఏసీలో సభ్యత్వాన్ని వైసీపీకి రాజ్యసభ ఆఫర్ చేసింది. ఈ నేపథ్యంలో బీఏసీలో విజయసాయిరెడ్డికి చోటు దక్కింది. బీఏసీలోకి విజయసాయిరెడ్డిని తీసుకున్నట్లుగా రాజ్యసభ ప్రధాన అధికారి ప్రకటించారు. వైసీపీ, సీఎం జగన్‌ చేస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా ప్రచారం చేయడంలో విజయసాయి రెడ్డి పదవి కీలకంగా మారుతుందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.