కేసీఆర్ నిర్ణ‌యం… సీమ రాజ‌కీయాలు మార్చేస్తుందా..?

ఏపీలో అడుగు పెట్టే విష‌యంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఆచి తూచి అడుగులు వేస్తున్నారనే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీని భార‌త రాష్ట్ర స‌మితి పార్టీగా మార్చిన త‌ర్వాత‌.. తొలి అడుగు మ‌హారాష్ట్రలో వేసి.. భారీ బ‌హిరంగం స‌భ పెట్టారు. త‌ర్వాత‌.. అంద‌రూ అనుకున్న‌ది మ‌లి అడుగు కేసీఆర్ ఏపీలోనే వేస్తార‌ని! కానీ.. కేసీఆర్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేదు.

అంటే.. ఏపీని వ‌దిలేసుకున్న‌ట్టు కాదు. ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు అంతే! పార్టీ ప‌రంగా చూసుకుంటే.. కేసీఆర్‌కు కావాల్సింది.. అసెంబ్లీ సీట్లు కాదు. వ‌చ్చినా ఇబ్బంది లేదు. పార్ల‌మెంటు స్థానాల‌పైనే ఆయ‌న కు ప్ర‌త్యేకంగా దృష్టి ఉంది. అలా.. త‌మ‌కు క‌లిసి వ‌చ్చే స్థానాల‌పై కేసీఆర్ దృష్టి పెట్టార‌ని స‌మాచారం ఇలా చూసుకుంటే.. సీమ రాజ‌కీయాల‌పై కేసీఆర్ ముద్ర వేసే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

సీమ‌లోని నాలుగు జిల్లాల‌ను క‌లిపి .. రాయ‌ల తెలంగాణ ఏర్పాటు చేయాల‌నే డిమాండ్ రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు నుంచి కూడా ఉంది. దీనిని త‌న‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాల్లో కేసీఆర్‌ ఉన్న‌ట్టు స‌మాచారం. అంటే.. త‌న అడుగు ఏపీలో వేయాల్సి ఉంటే.. అది సీమ గ‌డ్డ‌పైనేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక్క‌డ మ‌రో కార‌ణం కూడా.. ఉంది. అనేక మంది నాయ‌కుల‌కు గుర్తింపు కూడా లేక‌పోవడంతో వారంతా ఎదురు చూస్తున్నారు.

బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ వంటివారు.. తుల‌సిరెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, ఇలా అనేక మంది నాయ‌కులు వేదిక కోసం వెయిట్ చేస్తున్నారు. వీరు పాత‌కాపులే అయినా.. ప్ర‌స్తుతం పుంజుకునేందుకు వీరు తురుపు ముక్క‌లుగా మార‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇదే జ‌రిగితే.. అంటే.. కేసీఆర్ క‌నుక ఏపీపైదృష్టిపెట్టి సీమ‌పై అడుగు పెడితే.. రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను మార్పులు ఖాయ‌మ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.