రంగంలోకి వివేకా రెండో భార్య‌.. తెర‌వెనుక చ‌క్రం తిప్పుతోందెవ‌రు?

రెండు తెలుగు రాష్ట్రాల‌నే కాదు..దేశాన్ని సైతం ఉలిక్కిప‌డేలా చేసిన 2019 నాటి.. వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌లో భారీ ట్విస్ట్ తెర‌మీదికి వ‌చ్చింది. ఇన్నాళ్లుగా ఎక్క‌డ ఉన్నారో.. ఏం చేస్తున్నారో కూడా తెలియ‌ని.. వివేకా రెండో భార్య‌, ముస్లింమైనారిటీ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి ఇప్పుడు అకస్మాత్తుగా తెర‌మీదికి వ‌చ్చారు. వివేకా కుటుంబానికి చెందిన ఆస్తిలో త‌న‌కు భాగం కావాల‌ని.. దానిని వివేకా కుమార్తె.. సునీతా రెడ్డి తొక్కి పెడుతున్నార‌ని.. దీనిపై న్యాయ‌పోరాటానికి సిద్ధ‌మ‌య్యాయ‌ని.. ఆమె త‌న త‌ర‌ఫు లాయ‌ర్ ద్వారా మీడియాకు స‌మాచారం ఇచ్చారు.

దీంతో ప్ర‌స్తుతం వివేకా రెండో భార్య విష‌యం సంచ‌ల‌నంగా మారింది. అంతేకాదు.. ఆమె ఇంత హ‌ఠాత్తు గా తెర‌మీదికి ఎందుకు వ‌చ్చారు? దీని వెనుక ఎవ‌రు ఉన్నారు? అనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. ఇక‌, ఏం జ‌రిగిందంటే.. వివేకానంద రెడ్డి 2వ భార్య షేక్ షమీమ్ త‌ర‌ఫున ఆమె లాయ‌ర్ ఒక ప్ర‌క‌ట‌న చేశారు. తన పేరిట తన కొడుకు పేరిట వివేకానందరెడ్డి రాసిన వీలునామా ప్రకారం తనకు రావాల్సిన ఆస్థిని సునీత ఇవ్వాల్సిందిగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.

తన కొడుకు షేక్ షేహాన్ షా వివేకా కుమారుడో కాదో తేల్చుకునేందుకు డీఎన్ ఏ టెస్టులు జరిపి వైఎస్ వివేక వరుసుడో కాదో చెక్ చేసుకోవచ్చని లాయ‌ర్ త‌ర‌ఫున ఆమె చెప్పించారు. తనకు రావాల్సిన వాటా తనకు ఇప్పించమని తెలంగాణ హై కోర్టును కొరనున్నట్టు ష‌మీమ్ వివ‌రించారు. దీంతో ఈ కేసు మ‌రో మ‌లుపుతిరిగే ప‌రిస్థితి స్ఫ‌ష్టంగా తెలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఎంపీ అవినాష్ ప్ర‌క‌ట‌న త‌ర్వాతే..

ఇటీవ‌ల ఎంపీ అవినాష్‌ను సీబీఐ 5వ సారి విచార‌ణ కు పిలిచిన వెంట‌నే ఆయ‌న తెలంగాణ హైకోర్టులో అఫిడ‌విట్ వేశారు. ఈ కేసుకు త‌న‌కు సంబంధం లేద‌న్నారు. అంతేకాదు. వివేకా.. రెండో పెళ్లి చేసుకున్నార‌ని.. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నార‌ని.. చెప్పారు. హైద‌రాబాద్‌లో ఇల్లు కూడా క‌ట్టిస్తాన‌ని చెప్పార‌ని.. దీంతో సునీత కు ఈ కుటుంబానికి మ‌ధ్య వివాదాలు మొద‌ల‌య్యాయ‌ని.. ఆస్తి త‌గాదాల నేప‌థ్యంలో వివేకా హత్య జ‌రిగి ఉంటుంద‌ని అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఆయ‌న అలా ప్ర‌క‌ట‌న చేసిన రెండు రోజుల్లోనే ష‌మీమ్ తెర‌మీదికి వ‌చ్చారు.

ఎవ‌రున్నారు?

ఇక‌, వివేకా హ‌త్య జ‌రిగి నాలుగేళ్లు అయిపోయింది. మ‌రి ఇన్నాళ్ల‌లో ఎప్పుడూ కూడా.. నేను వివేకా భార్య‌ను అంటూ.. ష‌మీమ్ కానీ, ఆమె బంధువులు కానీ, వార‌సుడుగా ఉన్న అబ్బాయి కానీ.. తెర‌మీదికి రాలేదు. అంతేకాదు.. క‌నీసం మీడియా మీటింగ్ పెట్టి.. ఆవేద‌న కూడా వ్య‌క్తం చేయ‌లేదు. ఇలాంటిది.. ఇప్పుడు ఎంపీ అవినాష్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న స‌మ‌యంలో అనూహ్యంగా ష‌మీమ్ తెర‌మీదికి రావ‌డం.. వెనుక పెద్ద త‌ల‌కాయ‌లు ఉన్నాయ‌నే చ‌ర్చ న్యాయ వ‌ర్గాల్లో జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి వీరు ఎవ‌రు? కేసును ప‌క్క‌దారి ప‌ట్టించేందుకే ఇలా చేస్తున్నారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.