వైఎస్ భాస్క‌ర‌రెడ్డి అరెస్టు-అవినాష్ రెడ్డి విమ‌ర్శ‌లు: కిష‌న్‌రెడ్డి కౌంట‌ర్‌

వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్క‌ర‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయ‌డం.. చంచ‌ల‌గూడ జైలుకు త‌ర‌లించ‌డం జ‌రిగిపోయాయి. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై భాస్క‌ర‌రెడ్డి కుమారుడు ఎంపీ అవినాష్ సీబీఐపై విరుచుకుప‌డ్డారు. వివేకా కేసులో సీబీఐ విచారణ సరిగ్గా జరగట్లేదన్నారు. వాస్తవాల ఆధారంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. త‌న తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై మాట్లాడటానికి మాటలు రావట్లేదని వ్యాఖ్యానించారు. భాస్కర్ రెడ్డి అరెస్ట్‌ను ఊహించని విధంగానే అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు.

అయితే.. తాము ధైర్యం కోల్పోకుండా నిజాయితీని నిరూపించుకుంటామ‌ని అవినాష్ తెలిపారు. విచారణలో కీలక విషయాలను సీబీఐ వదిలేసిందని, సిల్లీ విషయాలతో వ్యక్తులే లక్ష్యంగా సీబీఐ విచారణ జరుగుతోందని విమ‌ర్శించారు. హత్య విషయం త‌న కంటే ముందే వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి ముందే తెలుసని చెప్పారు అవినాష్‌రెడ్డి. హత్యకు సంబంధించి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్ర‌శ్నించారు. సమాచారం ఇచ్చిన త‌న‌నే దోషి అంటున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

వివేకా కుమార్తె సునీత, సీబీఐ ఒక లక్ష్యంతోనే వ్యవహరిస్తున్నాయని అవినాష్ సందేహాలు వ్య‌క్తం చేశారు. తాము చెప్పిన అంశాలను సీబీఐ పరిశీలించడం లేదని, హత్య చేసిన దస్తగిరిని అప్రూవర్‌గా ఎలా మారుస్తారని, సీబీఐ సహకరించి బెయిల్ ఇప్పించిందని అవినాష్ రెడ్డి అన్నారు. అయితే.. అవినాష్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై కేంద్ర మంత్రి, తెలంగాణ‌కు చెందిన బీజేపీ నాయ‌కుడు కిష‌న్ రెడ్డి భారీ కౌంట‌ర్ ఇచ్చారు.

వివేకానంద‌రెడ్డి కేసును కొలిక్కి తీసుకొచ్చేందుకే సీబీఐ పని చేస్తోందన్నారు. వ్యక్తులు ఎవరైనా చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. కేజ్రీవాల్‌కు నోటీసులు ఎలా ఇస్తారని మాట్లాడుతున్నారు? అవినీతి ఆరోపణలు వస్తే దర్యాప్తు చేయొద్దా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు వివేకానంద‌రెడ్డి కేసులో విచార‌ణ చేయ‌క‌పోతే చేయ‌లేద‌న్నారని, చేస్తే.. ఎందుకు చేస్తున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

చ‌ట్టం ముందు అంద‌రూ స‌మానులేన‌ని త‌ప్పు చేయ‌న‌ప్పుడు న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించి త‌ప్పు చేయ‌లేద‌ని నిరూపించుకునే అవ‌కాశం మ‌న రాజ్యాంగం.. చ‌ట్టాలు క‌ల్పించాయ‌న్న విష‌యాన్ని అవినాష్‌రెడ్డి తెలుసుకోవాల‌ని చుర‌క‌లు అంటించారు. అంతేకాదు.. అస‌లు త‌ప్పు లేన‌ప్పుడు 72 ఏళ్ల వ‌య‌సున్న భాస్క‌ర‌రెడ్డిని సీబీఐ ఎందుకు అరెస్టు చేస్తుంద‌ని కిష‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. నిజాలు నిల‌క‌డ‌మీద తేలుతాయ‌ని చెప్పారు.