మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. వివేకా గుండెపోటుతో మరణించినట్లు తొలుత ప్రచారం జరిగినా పోగ పోగా అది గొడ్డలిపోటు అని తేలిపోయింది. అరెస్టు మెమోను భాస్కర్ రెడ్డి భార్యకు అందించిన సీబీఐ అధికారులు, ఆయన్ను హైదరాబాద్ తరలించారు. సాక్ష్యాలు చెరిపేయడంలో భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ అభియోగం మోపింది. వివేకా హత్యకు ముందు భాస్కర్‌రెడ్డి ఇంట్లో సునీల్ ఉన్నట్లు గూగుల్ టేకౌట్ ద్వారా గుర్తించినట్లు సీబీఐ చెబుతోంది. కదిరి వెళ్లి దస్తగిరి గొడ్డలి తెచ్చేవరకు భాస్కర్‌రెడ్డి ఇంట్లోనే సునీల్ ఉన్నాడని సీబీఐ అంటోంది..
అవినాష్ అరెస్టు తప్పదా ?
హత్య వెనుక ఎంపీ అవినాష్ రెడ్డి ఉండి ఉండొచ్చని చాలా రోజులుగా అనుమానాలు వినిపిస్తున్నాయి. ఆయన్ను సీబీఐ ఇప్పటికే నాలుగు సార్లు ప్రశ్నించింది. అనుమానితుల్లో బయట ఉన్నదీ అవినాష్ మాత్రమే. దానితో భాస్కర్ రెడ్డి తొలి దశ విచారణ పూర్తయిన తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్టు చేసినా ఆశ్చర్యం లేదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఎందుకంటే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి సహా నిందితులందరినీ ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నించాల్సి ఉంది..
#హూ కిల్డ్ బాబాయ్..
టీడీపీ సహా విపక్షాలన్నీ చాలా రోజుల నుంచి ఒక ప్రశ్న లేవనెత్తుతున్నాయి. సీఎం జగన్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ హూ కిల్డ్ బాబాయ్ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నాయి. సీఎం జగన్ పీఏతో పాటు ఆయన భార్య వైఎస్ భారతి సహాయకుడుని కడపలో సీబీఐ ప్రశ్నించిన తర్వాత టీడీపీ వాదనలకు బలం చేకూరిట్లైంది. వివేకా గుండెపోటుతో చనిపోయాడని ప్రకటించిన వారిలో జగన్ కూడా ఉన్నారు. తర్వాత అది హత్య అని తేలింది. ఏ ఆధారాలతో వివేకా గుండెపోటుతో చనిపోయారని జగన్ ప్రకటించారో సీబీఐ నిగ్గు తేల్చాలనుకుంటే ఆయన్ను ప్రశ్నించక తప్పదు. జగన్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా లేదా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది…