మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణలో వేగం పెంచింది. కడప వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డి తండ్రి, వైసీపీ నాయకుడు వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు ఈ రోజు ఉదయం 6.40 గంటల సమయంలో పులివెందులలోని ఆయన స్వగృహంలో అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి గత రాత్రి సీబీఐ బృందాలు కడప చేరుకున్నట్టు సమాచారం.అయితే.. ఎవరి కంటా పడకుండా.. అత్యంత రహస్యంగా ఉన్న అధికారులు ఉదయమే రంగంలోకి దిగారు.
పులివెందులలోని వైఎస్ భాస్కరరెడ్డి ఇంటికి రెండు బృందాలుగా వెళ్లిన సీబీఐ అధికారులు.. వివేకా హత్య కేసుకు సంబంధించి తొలుత ఆయనకు నోటీసులు ఇచ్చారు. అనంతరం.. ఆయనను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా భాస్కరరెడ్డి భార్యకు అరెస్టు నోటీసు ఇచ్చి.. ఆ వెంటనే భాస్కరరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన సెల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
భాస్కరరెడ్డి అరెస్టు అనంతరం.. ప్రత్యేక వాహనంలో ఆయనను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. వాహనం లోనే ప్రత్యేకంగా వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. కాగా, పది రోజుల కిందట భాస్కరరెడ్డిని విచారించేందుకు సీబీఐ పిలిచినట్టుగా ప్రచారం జరిగింది. దీంతో ఆయన కడపలోని జైలు గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్నారు. తనకు ఏ పాపం తెలియదని.. పేర్కొన్నారు. అదేసమయంలో వివేకానందరెడ్డి రాసిన లేఖను ఆధారంగా చేసుకుని ఎందుకు విచారించడం లేదని కూడా ప్రశ్నించారు.
తనను అరెస్టు చేసినా.. ఇబ్బందిలేదని భాస్కరరెడ్డి అప్పుడే చెప్పారు. తాను అనారోగ్యంతో ఉన్నానని.. కేవలం తమ ఇంటి పేరు వైఎస్ కావడంతోనే వేధింపులకు పాల్పడుతున్నారని.. ఆయన ఆరోపించారు. కాగా, తాజా అరెస్టుతో కడపలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. పోలీసులు 144 సెక్షన్ విధించడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates