రామానాయుడు స్టూడియోకు ఎస‌రొచ్చిందా?

ఏపీ అధికార పార్టీ వైసీపీ నాయ‌కులు చెబుతున్న‌ట్టు.. త‌మ పాల‌నా రాజ‌ధాని విశాఖ‌లో మ‌రో సంచ‌ల‌న వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. ఇక్క‌డ ఎప్పుడో మూడు ద‌శాబ్దాల కింద‌టే ముందుచూపుతో.. మెగా నిర్మాత‌.. ద‌గ్గుబాటి రామానాయుడు ఒక‌స్టూడియోను నిర్మించారు. అప్పుడ‌ప్పుడు.. ఇక్క‌డ చిన్న సినిమాలు రూపు దిద్దుకుంటున్నాయి. అయితే.. ఇప్పుడు ఈ స్టూడియో కేంద్రంగా వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. దీనిని ఆక్ర‌మించేందుకు వైసీపీ నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది.

స్టూడియోను ఆనుకుని ఇళ్ల నిర్మాణాలకు జీవీఎంసీ అనుమతి ఇచ్చిందని టీడీపీ సీనియర్‌ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. సీఎం జగన్‌, ఆయన అనుయాయులు విశాఖ బీచ్‌ రోడ్డులోని రామానాయుడు స్టూడియోనూ టేకోవర్‌ చేయడానికి యత్నించారన్న‌ది బండారు ఆరోప‌ణ‌. అంతేకాదు.. స్టూడియో ఉన్న కొండపై ఇళ్ల నిర్మాణాల కోసం అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో 15.18 ఎకరాలను సురేశ్‌ ప్రొడక్షన్స్‌ అధినేత దగ్గుబాటి సురేశ్‌బాబు, జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు పేరుతో తనఖా పెట్టారని చెప్పుకొచ్చారు.

టీడీపీ ఆరోప‌ణ‌..

సినీ పరిశ్రమ కోసం భూములు ఇస్తే, కొండపై ఇళ్ల నిర్మాణాలకు లేఅవుట్‌కు ఎలా అనుమతి ఇచ్చారు? అని బండారు ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌తో పాటు విశాఖలో కూడా సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని అప్పటి సీఎం చంద్రబాబు నిర్ణయించి భీమిలి బీచ్‌రోడ్డులో రుషికొండ దాటిన తరువాత కొండపై ఎకరా పాతిక లక్షలు చొప్పున 40 ఎకరాలను రామానాయుడుకు కేటాయించారని తెలిపారు.

త‌ర్వాత ఏం జరిగిందంటే..

ఆ తరువాత సీఎం అయిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య నేతృత్వంలో ఈ భూ కేటాయింపులపై కమిటీ వేశారు. అన్ని రికార్డులు పరిశీలించిన రోశయ్య కమిటీ భూ కేటాయింపుల్లో అక్రమాలు లేవని తెలిపింది. అయితే, భూముల ధర పెంచుకోవచ్చని నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో రామానాయుడు స్టూడియోకు 40 ఎకరాలు రిజిస్టర్‌ చేశారు.

జ‌గ‌న్ వ‌చ్చాక‌.. మారిన సీన్‌

2019లో జగన్‌ సీఎం అయ్యాక రామానాయుడు స్టూడియో టేకోవర్‌కు రెండేళ్ల క్రితమే ప్రణాళిక రచించారు. అందులో భాగంగానే తొలుత వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌లో స్టూడియోను మిక్స్‌డ్‌ యూజ్‌ (పరిశ్రమలు తప్ప వాణిజ్యం/గృహ వినియోగం)లో చేర్చారు. ఈ క్రమంలోనే స్టూడియోపై లేఅవుట్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుమతి తీసుకున్న సురేశ్‌బాబు తాజాగా జీవీఎంసీ కమిషనర్‌ పేరిట 15.18 ఎకరాలను తనఖా పెట్టారు. ఇదంతా దగ్గుబాటి సురేశ్‌బాబే చేశారా? లేదా ఆయనపై సీఎం, ఆయన అనుయాయులు ఒత్తిడి తెచ్చారా? అన్నది వెల్లడికావాలని టీడీపీ ఆరోపిస్తోంది.

టీడీపీ డిమాండ్ ఇదే!

  • ప్రభుత్వ అనుమతి లేకుండా కొండపై ఇళ్ల నిర్మాణాలకు లేఅవుట్‌ వేస్తే సురేశ్‌బాబుపై చర్యలు తీసుకోవాలి.
  • ఎవరైనా ఒత్తిడి వల్ల జరిగితే అందుకు కారణమైన వ్యక్తులను బాధ్యులను చేయాలి.
  • స్టూడియోలో లేఅవుట్‌కు అనుమతి కోసం దరఖాస్తు వచ్చినప్పుడు జీవీఎంసీ కమిషనర్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాయాలి.
  • ఆ విషయాన్ని రహస్యంగా ఉంచి మధురవాడ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తనఖాను రిజిస్టర్‌ చేశారు. ఆయ‌న‌పైనా చ‌ర్య‌లు తీసుకోవాలి.