గత కొద్దికాలంగా, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఘాటు విమర్శలు చేయడంలో ముందున్న కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి తాజాగా మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. అమ్మడం, అప్పు చేయడం, అధిక పన్నులు వేయడం.. ఇదే జగన్ త్రిసూత్ర పాలన అంటూ విమర్శించి సంచలనం సృష్టించిన ఆయన తాజాగా రాజధాని వికేంద్రీకరణ బిల్లులకు ఆమోద ముద్ర పడిన తర్వాత మరో కామెంట్ చేశారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక చీకటి రోజని, దుర్దినమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇల్లు అలకగానే పండుగ కాదని పేర్కొన్న తులసిరెడ్డి గవర్నర్ సంతకం చేస్తే చట్టం అవుతుందని… కానీ, ఆ చట్టాలు హైకోర్టులో నిలబడవని చెప్పారు.
మూడు రాజధానులకు ఏపీ గవర్నర్ ఆమోదముద్ర వేయడం దురదృష్టకరమని తులసిరెడ్డి పేర్కొన్నారు. మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి, రాష్ట్రపతి ఆర్డర్ కు వ్యతిరేకమని తులసిరెడ్డి అన్నారు. ఏపీ సర్కారు దూకుడుకు ఎదురుదెబ్బ తగలడం ఖాయమని జోస్యం చెప్పారు.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్ కు పంపగా దానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారని అయితే, కోర్టు కొట్టివేసిందని తులసిరెడ్డి గుర్తు చేశారు. తాజాగా రాజధానుల ఆర్డినెన్స్ విషయంలో కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పారు. చట్టాలు కోర్టుల్లో నిలబడలేవని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎంకు తులసిరెడ్డి సవాల్ విసిరారు. 2014లో అసెంబ్లీ సాక్షిగా ఏపీ రాజధానిగా అమరావతిని స్వాగతిస్తున్నానని చెప్పిన జగన్ ఇప్పుడు ఆ మాటను తుంగలో తొక్కినందున తన నిర్ణయానికి ప్రజల ఆమోదం తెలుసుకోవాలని సవాల్ విసిరారు. ఆయనకు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. మూడు రాజధానుల అంశం మీదే ఎన్నికలకు వెళ్లాలని ఛాలెంజ్ చేశారు తులసిరెడ్డి.
Gulte Telugu Telugu Political and Movie News Updates