వై నాట్ పులివెందుల : చంద్ర‌బాబు

ఏపీ అధికార పార్టీ వైసీపీపైనా.. ఆ పార్టీ అధినేత, సీఎం జ‌గ‌న్‌పైనా చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. వ‌చ్చే ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా.. వైసీపీ 175 స్థానాల్లోనూ చిత్తుచిత్తుగా ఓడిపోతుంద‌ని తేల్చి చెప్పారు. పులివెందుల‌లోనూ జ‌గ‌న్‌ను ఓడిస్తామ‌ని అన్నారు. ప్ర‌జ‌లు ఆగ్ర‌హావేశాల‌తోఉన్నార‌ని.. ఎన్నిక‌ల కోసం ఎదురు చూస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. “ఇప్పుడు వ‌చ్చినా.. ఎప్పుడు వ‌చ్చినా.. ఎన్నిక‌ల్లో వైసీపీకి మ‌ర‌ణ మృదంగ‌మే.” అని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.

మూడు జిల్లాల ప‌ర్య‌ట‌నను ల‌క్ష్యంగా పెట్టుకున్న టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు.. బుధ‌వారం నుంచి విశాఖ‌, నెల్లూరు, క‌డ‌ప‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. తొలుత ఆయ‌న విశాఖ చేరుకుని.. జోన‌ల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌న ఎన్నిక‌ల‌పై దిశానిర్దేశం చేశారు. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా… సిద్ధంగా ఉండాల‌ని సూచించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎలా ఎదుర్కొంటామన్న దానిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

గత టీడీపీ ప్రభుత్వంతో వైసీపీ సర్కార్ పాలనను పోలుస్తూ కార్యకర్తల్ని ఉత్సాహ పరిచారు. ప్ర‌జ‌ల‌ను తాము ఈ విధంగా ఎప్పుడూ వేధించ‌లేద‌న్నారు. అందుకే.. టీడీపీ చిర‌స్థాయిగా ప్ర‌జ‌ల హృద‌యాల్లో నిలిచిపోయింద‌ని తెలిపారు. ఇటీవ‌ల జ‌రిగిన గ్రాడ్యుయేట్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నిక‌లు వైసీపీకి కేవ‌లం శాంపిల్ మాత్ర‌మేన‌ని చెప్పారు. అసెంబ్లీ ఎన్నిక‌లు ఎప్పుడు పెట్టినా.. టీడీపీ విజ‌య దుందుభి మోగించి. చ‌రిత్ర‌ను తిర‌గ‌రాస్తుంద‌ని అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం 20 రోజుల ముందు అభ్యర్థిని ప్రకటించినా ప్రజలు మద్దతు పలికి గెలిపించారన్నారు. ఒక గెలుపు విజయం ఇస్తుంది…ఒక గెలుపు కుంగదీస్తుందంటూ వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు పార్టీకీ జోష్ ను ఇచ్చిందన్నారు. “వైసీపీ అంటున్నట్లు వై నాట్ 175 కాదు…ఇప్పుడు చెపుతున్నా వై నాట్ పులివెందుల” అని చంద్ర‌బాబు అన్నారు.

టీడీపీతో పెట్టుకున్న జగన్ ను చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలుపుతారని చంద్రబాబు చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలను జగన్ నిన్నటి వరకు హీనంగా చూశాడని, ఇప్పుడు వారికి గౌరవం ఇస్తాను అంటున్నాడని గుర్తుచేశారు. మనకు గత ఎన్నికల్లో 23 సీట్లు వస్తే ఇది దేవుడి స్క్రిప్ట్ అని హేళన చేశాడని, అందుకే దేవుడి ఆ స్క్రిప్ట్ తిరగరాశాడన్నారు. 23వ సంవత్సరం…23 వ తేదీ 23 ఓట్లతో మన ఎమ్మెల్సీ గెలిచారని పంచుమ‌ర్తి అనురాధ విష‌యాన్ని చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు.

జ‌గ‌న్‌ ప్రభుత్వానికి ఎక్సైపైరీ టైం వచ్చిందని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. “మేం 175 పోటీ చేస్తామా లేదా అనేది మీకు ఎందుకు చెప్పాలి. మేం 175లో వైసీపీని ఓడిస్తాం. పులివెందులలో కూడా జగన్ ను ఓడిస్తాం” అని వైసీపీకి చంద్ర‌బాబు కౌంట‌ర్ ఇచ్చారు.